ఏపీని ఆర్ధికంగా ఆదుకోండి..ఢిల్లీ టూర్‌లో కేంద్ర పెద్దలకు జగన్ విజ్ఞప్తులు

Update: 2019-08-07 14:52 GMT

ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసిన వైఎస్ జగన్‌ రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే, వివాదాస్పదమైన పోలవరం టెండర్ల రద్దు, పీపీఏల సమీక్షపై మోడీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు చెల్లించడంతోపాటు ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలంటూ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాకు మెమొరాండాలు ఇచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డి రెండోరోజు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమైన సీఎం వైఎస్ జగన్ ఏపీ అభివృద్ధికి సహకరించాలంటూ కోరారు. అయితే, ఏపీకి ఎప్పుడూ తన వంతు సహకారం ఉంటుందని వెంకయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో దాదాపు గంటపాటు సమావేశమైన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై చర్చించారు. ఆ తర్వాత ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌‌ను కలిసిన వైఎస్ జగన్‌ ఏపీ ఆర్ధిక ఇబ్బందులను వివరించి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఏపీ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పెండింగ్‌ బకాయిలు విడుదల, పోల‌వ‌రం నిధుల రీఎంబ‌ర్స్‌మెంట్‌, కడపలో స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, ప్రత్యేక ఆర్ధిక సాయం ఇవ్వాలంటూ ప్రధాని, కేంద్ర మంత్రులను జగన్మోహన్‌‌రెడ్డి కోరారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న నవరత్నాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News