JanaSena: బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారా?.. సైకిల్‌పై సవారీ చేస్తారా?

JanaSena: పవర్ షేరింగ్‌కు సిద్ధమని తమ్ముళ్ల ఆఫర్‌?

Update: 2022-06-11 09:27 GMT

JanaSena: బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారా?.. సైకిల్‌పై సవారీ చేస్తారా? 

JanaSena: కమలంతో కంటిన్యూ అయ్యే రాజకీయంపై సేనానికి క్లారిటీ వచ్చేసిందా? ఇన్నాళ్లూ మా దోస్త్‌ మా దోస్త్‌ అంటూ భుజానికెత్తుకున్న కమలం పార్టీ పవన్‌‌ను తెలివిగా సైడ్‌ చేస్తోందా? ఇదంతా గ్రహించిన జనసేనాని, గతానికి భిన్నంగా పావులు కదుపుతున్నారా? రాజకీయాల్లో రాటు దేలాలా తన పనితీరుకు పదును పెడుతున్నారా? అంతంతమాత్రంగా ఉన్న కమలంతో దోస్తీకి మంచి ముహర్తం చూసి కటీఫ్ చెప్పడమే బెటర్ అని భావిస్తున్నారా? ఇదంతా ఒంటరిగా పోరాడాలన్న ఆలోచనా పాత మిత్రుడితో కలసి పోవాలన్న భావనా? ఇంతకీ పవన్ వేస్తున్న సైలెంట్‌ స్కెచ్‌పై ఏపీ పాలిటిక్స్‌ ఏమంటోంది?

రాజమహేంద్రవరంలో జరిగిన గోదావరి గర్జన సభ సాక్షిగా కమలం, గ్లాస్‌ కాంబినేషన్స్‌పై క్లారిటీ వచ్చేసింది. ఇక ఎవరి దారి వారిదే అన్నట్టుగా దారి క్లియర్‌ అయినట్టే కనిపిస్తోంది. మొన్నీ మధ్యే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వచ్చారు. రెండురోజులు పర్యటించారు. అంతకముందే ఢిల్లీలో కమలం పెద్దలను కలసి వచ్చిన పవన్‌కల్యాణ్‌ విషయంలో నడ్డా ఓ కీలకమైన ప్రకటన చేస్తారని అందరూ ఊహించారు. జనసైనికులైతే తమ అధినేత పవన్‌కల్యాణ్‌‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మాట మాత్రమైనా ఆ విషయం చెప్పకుండా నడ్డా తిరిగి ఫ్లైట్‌ ఎక్కి ఢిల్లీ వెళ్లడంతో జనసైనికులు, మరీ ముఖ్యంగా జనసేనాని పూర్తిగా ఆశలు వదులుకున్నారట. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారట. అయితే, సేనాని నోట గానీ, జనసైనికుల నోట నుంచి కానీ ఆ మాట రాకున్నా కమలంతో ఉండటం ఇక అయ్యే పని కాదన్న టాక్‌ వినిపిస్తోంది. మరి తర్వాతి పవన్‌ స్టెప్పేంటి? ఒంటరిగా పోరాడుతారా పాత మిత్రుడైన సైకిల్‌ ఎక్కి సవారీ చేస్తారా.? ఈ రెండు ప్రశ్నలు పవన్‌ అభిమానులు వెంటాడుతుంటే ఏపీ రాజకీయాల్లో సరికొత్త మాట వినిపిస్తోందట.

జనసేన పార్టీపై ఎప్పుడూ ఏవో ఒక అంచనాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. 2014లో పార్టీ స్థాపించి నాడు పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన జనసేనాని, మొన్నటి 2019 ఎన్నికలకు వామపక్షాలు, బీఎస్పీలతో కలసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే జగన్ హవాలో కేవలం ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకున్న జనసేన, చివరకు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతుగా మారిపోవటంతో జీరో దగ్గరే ఆగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోన్న పవన్, కమలంతో ఇక పని కాదంటూ వైసీపీపై ఎదురుదాడే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. బీజేపీతో చేస్తోన్న దోస్తీకి త్వరలోనే ముగింపు పలికి మళ్లీ టీడీపీకి స్నేహహస్తం అందిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో టీడీపీ, బీజేపీలతో దోస్తీ కట్టినపుడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ వైఫల్యాలు జనసేనను వెంటాడాయి. దీంతో ఆ పార్టీకి కటీఫ్ చెప్పి 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఇద్దరి మధ్యా అండర్ స్టాండింగ్ ఉందన్న విమర్శలకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ప్రతికూల ఫలితాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం బీజేపీతో దోస్తీ చేయటం వల్ల తమకు రాజకీయంగా వచ్చే మైలేజ్ ఏం లేదన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా బీజేపీ వైఫల్యాలు, రాష్ట్రానికి ఉపయోగపడే కీలక అంశాలపై కేంద్రం అనుసరిస్తోన్న నిరాదరణ వైఖరి వల్ల బీజేపీ మసి జనసేనకు అంటుకునే ప్రమాదం ఉందని ఆ పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారట. దీంతో వచ్చే ఎన్నికలకు మళ్లీ ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీతో కలిసి బరిలోకి దిగినా ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని వారు భావిస్తున్నారట. రాయలసీమలో కొన్ని చోట్ల మినహా రాష్ట్రమంతటా మనకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందనీ, అన్ని సామాజికవర్గాలను కలుపుకుని వెళ్తే విజయం వరిస్తుందని చెబుతోన్న మాటల్ని విన్న జనసేనాని ఆలోచనలో పడ్డారట. పవర్‌స్టార్‌నే కానీ పవర్ లేదని ఒకప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటే ఈసారి వదిలేదేలే అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారతాయి జనసేన ప్రభుత్వం వస్తుంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంది వ్యూహంలో భాగమేనని చెప్పటం చూస్తుంటే, ఇప్పటికే పవన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సంకేతమని పార్టీ క్యాడర్ భావిస్తోందట.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న సినిమా పాటను గుర్తుచేసుకుంటున్న జనసైనికులు తమకు క్షవరం అయితేనే కానీ వివరం తెలిసిరాలేదని ఫీలవుతున్నారట. పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ తమ వల్ల అవతలి వాళ్లకు లాభం కలిగిందే కానీ తమకు ఏమాత్రం మంచి జరగలేదని ఆలస్యంగా తెలుసుకున్న అధినేత, మిగతా పార్టీల తిక్కలు సరిచేసి తనకో లెక్క ఉందని చెప్పేందుకు డిసైడ్‌ అయ్యారట. లేట్‌గా అయినా లేటెస్ట్‌గా డిసైడ్‌ అయిన అధినేత తన తిక్కను సరిచేసి దాన్ని సెట్‌ చేసేందుకు స్కెచ్‌లు వేస్తున్నారట. అయితే, మొన్నటివరకూ కన్ఫ్యూజన్‌తో ఉన్న పవన్ తన పొలిటికల్ జర్నీపై కాస్తంత క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తున్నారని చెబుతున్నారు జనసైనికులు. బీజేపీ రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తానని చెప్పుకోవడం, కమలం క్యాంప్‌ నుంచి అలాంటి మ్యాపేదీ రాకపోవడంతో పొలిటికల్ కెరీర్‌ను సక్సెస్ బాట పట్టించేందుకు తెర వెనుక కథ, స్క్రీన్ ప్లే రచించుకుంటున్నట్లు సమాచారం. ఎప్పుడూ త్యాగాలకు కేరాఫ్‌గా నిలిచే బదులు ముందు సొంత పార్టీని బలోపేతం చేసుకునేందుకు దృష్టి పెట్టారట. బీజేపీతో రాజకీయ పయనం అంత శ్రేయస్కరం కాదని పార్టీలో మెజారిటీ వర్గం భావిస్తుండటంతో కమలం పార్టీకి రామ్‌రామ్ చెబితేనే బెటరని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో గోడ అవతల నుంచొని జనసేనానికి పొలిటికల్ ప్రేమ బాణాలు విసురుతున్న టీడీపీ, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి గెలుపు తప్పనిసరవడంతో జనసేన తమతో కలిసి వస్తే పవర్ షేరింగ్‌కు సిద్ధమన్న లీకులు టీడీపీ శిబిరం నుంచి వస్తున్నాయి. ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకుందామనీ, మొదట రెండున్నరేళ్లు పవన్‌కే సీఎం పగ్గాలు అప్పజెబుతామన్న చర్చలు కూడా తెర వెనుక జోరుగా జరుగుతున్నాయట. కానీ ఇప్పటికిప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవటం, మరో పార్టీతో చేతులు కలిపి సొంత పార్టీ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టించుకోవటం ఎందుకనుకున్నారో ఏమో కానీ జనసేనాని పవన్ ఆలోచన అయితే ప్రస్తుతానికైతే జనసేన బలోపేతపైనే ఉందట. బీజేపీ, టీడీపీలకు తోకపార్టీ అన్న విమర్శలకు చెక్ పెట్టాలంటే ముందు రాజకీయ బరిలో బలపడాలి ఆ తర్వాత నిలబడాలన్న నిర్ణయానికొచ్చేశారట. బలంగా ఉంటే ఎన్నికల సమయానికి పొత్తుల సంగతి చూసుకోవచ్చు దృష్టంతా సొంత బలంపైనే పెట్టాలని జనసైనికులకు కూడా అధినేత సంకేతాలు పంపారన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదంటున్న కార్యకర్తలు పవన్‌కల్యాణ్‌ మళ్లీ జనంలోకి రావాలని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించాలని, క్యాడర్‌లో జోష్‌ నింపాలని కోరుతున్నారు. మరి పవన్ వ్యూహాలు, ఈసారైనా ఫలిస్తాయా? వెండి తెర మీద ఫైట్లు, డైలాగులతో అభిమానుల్ని ఆకట్టుకునే పవన్ ఈసారి ఓటర్లు తనను అక్కున చేర్చుకునేలా పని చేస్తారా? ఈ ఇంట్రెస్టింగ్ సందేహాలకు పవన్ ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Full View


Tags:    

Similar News