Chikatilo OTT Release: ఓటీటీలోకి ఈ వారం శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’
Chikatilo OTT Release: శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Chikatilo OTT Release: ఓటీటీలోకి ఈ వారం శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’
Chikatilo OTT Release: ఈ వారం ఓటీటీలోకి మరో ఆసక్తికరమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని వారి కోడలు, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘చీకటిలో’ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
థియేటర్లకు వెళ్లకుండా నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. శోభితా ఇందులో ‘సంధ్య’ అనే ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపించనుంది.
కథ ప్రకారం, సంధ్య దగ్గర పనిచేసే ఓ ఇంటర్న్ అనుమానాస్పదంగా మృతి చెందుతుంది. ఆ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని వెలికితీయడానికి సంధ్య తన పాడ్‌కాస్ట్‌ను ఆయుధంగా మలుచుకుంటుంది. ఈ దర్యాప్తు క్రమంలో హైదరాబాద్ నగరాన్ని ఒకప్పుడు భయపెట్టిన ఓ సీరియల్ కిల్లర్‌కు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటపడతాయి.
సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాంల ప్రభావం, నేరాలపై సమాజంలో ఏర్పడుతున్న మార్పులను ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నంలో సంధ్య ఎదుర్కొనే ప్రమాదాలే ఈ కథలో ప్రధానాంశం.
‘కిర్రాక్ పార్టీ’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మించారు. శోభితాతో పాటు విశ్వదేవ్ రాచకొండ, ఆమని, ఝాన్సీ, చైతన్య విశాలాక్షి కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.