NTR Chennai House: అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో సందర్శకులకు అందుబాటులోకి చెన్నైలోని ఎన్టీఆర్ నివాసం!

చెన్నైలోని ఎన్టీఆర్ చారిత్రాత్మక నివాసం పునరుద్ధరణకు సిద్ధమైంది. టీ నగర్‌లోని బసవతారక నిలయాన్ని త్వరలోనే అభిమానుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ..

Update: 2026-01-19 14:08 GMT

తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (NTR) జ్ఞాపకాలు మళ్ళీ చిగురించబోతున్నాయి. దశాబ్దాల కాలంగా నిర్మానుష్యంగా ఉన్న ఆయన చెన్నై నివాసం ఇప్పుడు కొత్త హంగులతో ముస్తాబవుతోంది. త్వరలోనే ఈ చారిత్రాత్మక భవనం అభిమానుల సందర్శనార్థం సిద్ధం కాబోతోంది.

ఆ జ్ఞాపకం పేరు 'బసవతారక నిలయం'

తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు (నేటి చెన్నై) కేంద్రంగా సాగుతున్న రోజుల్లో, ఎన్టీఆర్ అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1953లో చెన్నైలోని టీ నగర్ (త్యాగరాయ నగర్), బజుల్లా రోడ్డులో తన సతీమణి బసవతారకం గారి పేరు మీద ఒక ఇంటిని కొనుగోలు చేశారు.

ఆ ఇంటి విశేషాలు:

అభిమానుల గుడి: అప్పట్లో ఎన్టీఆర్‌ను దైవంగా భావించే అభిమానులు, మద్రాసు వెళ్తే ఖచ్చితంగా ఈ ఇంటికి వెళ్లి ఆయనను దర్శించుకునేవారు.

దిగ్గజాల అడ్డా: ఈ ఇంటికి సమీపంలోనే మరో సినీ దిగ్గజం దాసరి నారాయణరావు నివాసం కూడా ఉండేది.

బోసిపోయిన భవనం: ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన హైదరాబాద్‌కు మకాం మార్చాక ఈ చెన్నై నివాసం దశాబ్దాలుగా ఖాళీగా ఉండిపోయింది.

పునరుద్ధరణ పనులు పూర్తి..

చాలా కాలంగా ఎన్టీఆర్ నివాసాన్ని ఒక స్మారక చిహ్నంలా మార్చాలని అభిమానులు కోరుతున్నారు. వారి కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితులైన నిర్మాత చదలవాడ తిరుపతిరావు మరియు ఆయన సోదరులు ఈ భవనాన్ని కొనుగోలు చేసి, పాత జ్ఞాపకాలు చెక్కుచెదరకుండా మరమ్మతులు చేయిస్తున్నారు.

ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. టీ నగర్ నుంచి వడపలని వెళ్లే ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్నప్పుడు ఈ భవనం స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ ఇంటిని అభిమానులు లోపలికి వెళ్లి చూసేలా అవకాశం కల్పించనున్నారు.

Tags:    

Similar News