Korean Kanakaraju: వరుణ్ తేజ్ పుట్టినరోజు ట్రీట్.. ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ విడుదల
Korean Kanakaraju: వరుణ్ తేజ్ 15వ సినిమా ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ పుట్టినరోజున విడుదలైంది. ఇండో-కొరియన్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.
Korean Kanakaraju: వరుణ్ తేజ్ పుట్టినరోజు ట్రీట్.. ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ విడుదల
Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దక్కింది. వరుణ్ తేజ్ హీరోగా, మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 15వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ‘VT15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు.
పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. గ్లింప్స్ ప్రారంభంలో కనకరాజు కోసం కొరియా పోలీసులు ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌ను విచారించడం, చిత్రహింసలు పెట్టడం చూపించారు. పౌర్ణమి రాత్రి కనకరాజు (వరుణ్ తేజ్) ఓ ఆత్మ ఆవహించిన వ్యక్తిలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి సమురాయ్ కత్తితో పోలీసులను అంతం చేయడం గ్లింప్స్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. చివర్లో వరుణ్ తేజ్ కొరియన్ భాషలో “నేను తిరిగొచ్చాను” అని చెప్పడం, “ఈ కనకరాజు మన కనకరాజు కాదు” అంటూ వచ్చే డైలాగ్ ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఈ సినిమా ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, పనీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం, కొరియాలలో కీలక షెడ్యూళ్లను పూర్తి చేసిన చిత్రాన్ని 2026 వేసవిలో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.