Sundarakanda : నారా రోహిత్ సుందరకాండ రివ్యూ.. ఏడేళ్ల తర్వాత వచ్చిన ఈ ఫీల్-గుడ్ సినిమా ఎలా ఉందంటే?

Sundarakanda : నారా రోహిత్ సుందరకాండ రివ్యూ.. ఏడేళ్ల తర్వాత వచ్చిన ఈ ఫీల్-గుడ్ సినిమా ఎలా ఉందంటే?

Update: 2025-08-27 05:30 GMT

Sundarakanda : నారా రోహిత్ సుందరకాండ రివ్యూ.. ఏడేళ్ల తర్వాత వచ్చిన ఈ ఫీల్-గుడ్ సినిమా ఎలా ఉందంటే?

Sundarakanda : పొలిటికల్ థ్రిల్లర్ అయిన 'ప్రతినిధి 2' పక్కన పెడితే, నారా రోహిత్ ఏడేళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా సుందరకాండ. చాలాకాలం తర్వాత ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా ఎలా ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా? నారా రోహిత్‌కు విజయాన్ని తెచ్చిపెడుతుందా? ఈ రివ్యూలో చూద్దాం.

సినిమా కథ ఏమిటి?

సిద్ధార్థ్ (నారా రోహిత్) అనే వ్యక్తికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాదు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఐదు లక్షణాలు ఉండాలని ఒక కండిషన్ పెట్టుకుంటాడు. ఈ కండిషన్ వెనుక ఒక ఫ్లాష్‌బ్యాక్ ఉంది. స్కూల్లో తనకు సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్)ని సిద్ధార్థ్ ప్రేమిస్తాడు. ఆమెలో ఈ ఐదు లక్షణాలను చూసి ఇష్టపడతాడు. కానీ, వారి ప్రేమకు ఎలా బ్రేకప్ పడింది అనేది ఒక కథ.

కథ ముందుకు సాగుతుండగా, ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఐరా (వృతి వాఘాని) అనే స్టూడెంట్‌తో సిద్ధార్థ్‌కు పరిచయం అవుతుంది. ఆమెలో తాను కోరుకున్న ఐదు లక్షణాలు కనిపిస్తాయి. దీంతో, అమెరికా వెళ్లాల్సిన సిద్ధార్థ్, ఐరా కోసం ఒక కాలేజీలో లెక్చరర్‌గా చేరతాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే, వారికి వయసు తేడా కంటే పెద్ద సమస్య ఒకటి ఎదురవుతుంది. అది రెండో కథ. సిద్ధార్థ్ తల్లిదండ్రులు (నరేష్, రూప లక్ష్మి), అక్క (వాసుకి), స్నేహితులు (సత్య, సునైనా, అభినవ్ గోమఠం) ఈ కథల్లో ఎలా సహాయం చేస్తారు? వైష్ణవి, ఐరా కథలు ఎలా కలిశాయి? చివరకు సిద్ధార్థ్ ప్రేమ సఫలమైందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

కథనం, దర్శకత్వం

'సుందరకాండ' కథ చాలా సింపుల్‌గా, ఫ్రెష్‌గా ఉంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు ఎవరూ చూపించని పాయింట్‌ను దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి బాగా డీల్ చేశారు. కథలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు ఊహించడం కష్టం కాదు. కానీ, ఆ ట్విస్టుల ఆధారంగా రాసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా, సత్య - సునైనా జోడీ కామెడీ అదిరిపోయింది. చాలా చోట్ల ఈ కామెడీ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.

దర్శకుడిగా కంటే రచయితగా వెంకటేష్ నిమ్మలపూడి మంచి మార్కులు సాధించారు. ఆయన రాసిన మాటలు చాలా బాగున్నాయి. క్లీన్ కామెడీ, హాయిగా నవ్వించే సన్నివేశాలతో సినిమా సాఫీగా సాగుతుంది. పాటలు, విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అయితే, సినిమా మధ్యలో కొన్ని సన్నివేశాలు కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. రెగ్యులర్ సినిమాలు చూసేవారికి ఇంటర్వెల్ ట్విస్ట్ మొదటి అర్ధభాగంలోనే తెలిసిపోవచ్చు.

నటీనటుల నటన, టెక్నికల్ అంశాలు

నారా రోహిత్ సిద్ధార్థ్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. నటన, డైలాగ్ డెలివరీ విషయంలో ఎలాంటి వంక పెట్టలేం. ఇంకా బరువు తగ్గితే బాగుంటుందని అనిపించింది. వృతి వాఘాని క్యూట్ లుక్స్‌తో, అమాయకమైన నటనతో ఆకట్టుకుంది. శ్రీదేవి విజయ్ కుమార్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బలంగా ఉంది. నరేష్, రూపాలక్ష్మి, అభినవ్ గోమఠం, వాసుకి.. ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ తమ పాత్రల్లో ఒదిగిపోయాయి. ముఖ్యంగా సత్య, సునైనా కామెడీ టైమింగ్ సినిమాకే హైలైట్. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఫైట్స్ కొత్తగా డిజైన్ చేశారు.

ప్లస్ పాయింట్స్: కొత్త కథాంశం, అద్భుతమైన కామెడీ, మంచి నటీనటుల ఎంపిక, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

మైనస్ పాయింట్స్: కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపించడం, ట్విస్ట్‌లు కొంచెం ఊహించగలిగేలా ఉండటం.

చివరిగా

'సుందరకాండ' ఒక ఫీల్-గుడ్ లవ్ స్టోరీ. కామెడీ టచ్‌తో కూడిన ఈ సినిమా ఓ ట్విస్ట్‌తో ఆసక్తిగా సాగుతుంది. పండక్కి కుటుంబం అంతా కలిసి చూసి, హాయిగా నవ్వుకునే చక్కటి సినిమా ఇది. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. నారా రోహిత్‌కు ఇది ఒక మంచి విజయం అని చెప్పవచ్చు. హ్యాపీగా థియేటర్‌కు వెళ్లి చూడదగ్గ సినిమా.

రేటింగ్ : 3.5/5

Tags:    

Similar News