Tirumala: సామాన్యుడికి సెకన్లు.. సెలబ్రిటీలకు 10 నిమిషాలా? తిరుమలలో సెలబ్రిటీ కల్చర్

Mukku Avinash: కలియుగ వైకుంఠం తిరుమల కొండపై భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసి, ఆ గోవిందుడిని కళ్లారా చూసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు.

Update: 2026-02-27 03:58 GMT

Tirumala: సామాన్యుడికి సెకన్లు.. సెలబ్రిటీలకు 10 నిమిషాలా? తిరుమలలో సెలబ్రిటీ కల్చర్ 

Mukku Avinash: కలియుగ వైకుంఠం తిరుమల కొండపై భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసి, ఆ గోవిందుడిని కళ్లారా చూసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు. అయితే, తీరా గర్భాలయం ముందు చేరుకోగానే ‘జరుగు.. జరుగు’ అంటూ సిబ్బంది నెట్టేయడంతో కనీసం 10 సెకన్లు కూడా స్వామివారిని చూడలేకపోతున్నామని భక్తులు తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి తరుణంలో సినీ సెలబ్రిటీలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు భక్తుల పుండుపై కారం చల్లినట్లు మారుతున్నాయి.

తాజాగా జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ తన టీమ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, దర్శనం తర్వాత ఒక వీడియోలో మాట్లాడుతూ.. తాను శ్రీవారి ముందు సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు నిలబడి స్వామివారినే చూస్తూ ఉన్నాను అని పేర్కొన్నారు. దీనికి సహకరించిన శ్రీముఖి, నవీన్‌లకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మాకు 5 సెకన్లు కూడా గడవకముందే తోసేసే టీటీడీ, వీరికి 15 నిమిషాలు దర్శనం ఎలా కల్పిస్తుంది? సెలబ్రిటీలకు ఒక రూల్, సామాన్యులకు మరో రూలా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

గతంలో 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివాని నాగారం కూడా ఇలాగే 15 నిమిషాల పాటు స్వామివారి ముందు ఉన్నానని చెప్పి వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవ్వడంతో ఆమె క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవినాష్ కూడా అదే తరహాలో మాట్లాడటం టీటీడీ పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఒకవైపు టీటీడీ తాము సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతోంది. కానీ, ఇలాంటి వీడియోలు భక్తులలో అసహనాన్ని పెంచుతున్నాయి. మరోవైపు, కొందరు మాత్రం కావాలనే టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు ఇలాంటి చిన్న విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి గర్భాలయంలో అంత సేపు ఎవరినీ ఉంచడం సాధ్యం కాదని, సెలబ్రిటీలు అతిశయోక్తిగా మాట్లాడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

తిరుమల లడ్డూ వివాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో, ఇటువంటి దర్శన వివాదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. సెలబ్రిటీలు తమ భక్తిని చాటుకోవడంలో తప్పులేదు కానీ, సామాన్య భక్తుల కష్టాలను మరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. టీటీడీ అధికారులు దీనిపై స్పందించి, అందరికీ సమానమైన దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News