Gold Smuggling: వెండితెరపై హీరోయిన్ .. తెర వెనుక స్మగ్లింగ్ రాణి
Actress Ranya Rao Arrested: సినిమా గ్లామర్ వెనుక చీకటి దందాలు ఉంటాయని మరోసారి నిరూపితమైంది.
Gold Smuggling : వెండితెరపై హీరోయిన్ .. తెర వెనుక స్మగ్లింగ్ రాణి
Actress Ranya Rao Arrested: సినిమా గ్లామర్ వెనుక చీకటి దందాలు ఉంటాయని మరోసారి నిరూపితమైంది. కేవలం ఏడాది కాలంలో ఏకంగా 127 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా భారత్‌కు చేరవేసిన ఆరోపణలతో నటి రన్యా రావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపింది. సుమారు రూ. 102.55 కోట్ల విలువైన ఈ అక్రమ రవాణా కేసు ఇప్పుడు కన్నడ నాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కథ 2025 మార్చి 3న బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదలైంది. దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావుపై పక్కా సమాచారంతో నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు, ఆమెను తనిఖీ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆమె వద్ద అక్రమంగా దాచిన 14.213 కిలోల బంగారం బయటపడింది, దీని విలువ రూ. 12.56 కోట్లు.
అరెస్ట్ అనంతరం ఇడి అధికారులు రంగంలోకి దిగి రన్యా నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో.. రూ. 2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదు, పలు షెల్ కంపెనీలకు సంబంధించిన కీలక పత్రాలు లభ్యమయ్యాయి. కేవలం నటిగానే కాకుండా, ఆమె వెనుక ఒక పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తరుణ్ కొండూర్, సాహిల్ సకారియా జైన్ వంటి కీలక సహచరులతో కలిసి ఆమె ఈ హవాలా దందాను నడిపించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలను ఎయిర్‌పోర్ట్ తనిఖీల్లో ఎక్కువగా అనుమానించరనే బలహీనతను రన్యా రావు తన పెట్టుబడిగా మార్చుకుంది. విదేశాల నుంచి తెచ్చిన బంగారాన్ని దేశీయ మార్కెట్‌లో జ్యువెలర్లకు విక్రయించి, ఆ నగదును హవాలా మార్గాల్లో మళ్లీ విదేశాలకు పంపేది. ఈ నల్లధనాన్ని చట్టబద్ధమైన వ్యాపార ఆదాయంగా చూపించేందుకు నకిలీ బ్యాంక్ ఖాతాలను కూడా వాడారు.
ప్రస్తుతం రన్యా రావు తన సహచరులతో కలిసి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆమెను మరింత ఇరుకున పెట్టింది. గ్లామర్ ప్రపంచంలో తారగా వెలగాల్సిన ఆమె, అతి ఆశతో కటకటాల పాలవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.