Virosh Wedding : నేడే విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. . రాయల్ వెడ్డింగ్‌కు అదిరిపోయే భోజన మెనూ!

నేడే విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. . రాయల్ వెడ్డింగ్‌కు అదిరిపోయే భోజన మెనూ!

Update: 2026-02-26 00:45 GMT

Virosh Wedding : టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమాయణం ఎట్టకేలకు శుభం కార్డు దిశగా సాగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట పెళ్లి వేడుకలు అంబరాన్నంటాయి. ఫిబ్రవరి 25 రాత్రి జరిగిన సంగీత్, మెహందీ వేడుకలతో ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ అంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. విజయ్ అత్యంత సన్నిహితులైన సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో పాటు రష్మిక స్నేహితురాలు ఆషికా రంగనాథ్ వంటి సెలబ్రిటీలు డ్యాన్సులతో హోరెత్తించారు. నాప్‌కిన్స్‌పై కూడా VIROSH అని ఎంబ్రాయిడరీ చేయించారంటే ఈ జంట ప్రతి చిన్న విషయాన్ని ఎంత స్పెషల్‌గా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు సిసలైన వేడుక ఫిబ్రవరి 26న (నేడు) జరగనుంది. ఈ పెళ్లిలో ఒక ప్రత్యేకత ఉంది.. అదేమిటంటే విజయ్, రష్మికలు రెండు విభిన్న సంప్రదాయాల్లో ఒకే రోజు రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య తెలుగు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ముహూర్తం నిర్ణయించారు. అచ్చమైన పట్టు వస్త్రాల్లో వీరు ఏడడుగులు వేయనున్నారు. అనంతరం సాయంత్రం వేళ రష్మిక సొంత ఊరైన కూర్గ్ (కర్ణాటక)లోని కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరగనుంది. కొడవ పద్ధతిలో రష్మిక ప్రత్యేకమైన శైలిలో చీర కట్టుకుని, విజయ్ వారి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోనున్నారు. ఈ డబుల్ వెడ్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి విందు విషయానికి వస్తే, అతిథుల కోసం అదిరిపోయే మెనూ సిద్ధం చేశారు. అటు తెలంగాణ ఘుమఘుమలు, ఇటు కర్ణాటక రుచుల కలయికతో విందు భోజనం నోరూరించనుంది. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్ వడ్డిస్తున్నారు. రష్మిక కొడవ సంప్రదాయం ప్రకారం ఆచారబద్ధంగా వడ్డించేపోర్క్ కర్రీ (పంది మాంసం) ఈ విందులో హైలైట్‌గా నిలవనుంది. కేవలం ఆహారం కోసమే కాకుండా, అతిథుల విలాసం కోసం ఒక్కో గదికి రూ. 20 వేల నుంచి రూ. 70 వేల వరకు అద్దె ఉన్న లగ్జరీ గదులను బుక్ చేశారు. ప్రైవేట్ హెలిప్యాడ్ సదుపాయం ఉన్న ఈ రిసార్ట్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఉదయ్‌పూర్ వేడుకలు ముగిసిన తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం, అభిమానుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు ఐదేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత ఈ క్రేజీ కపుల్ ఒక్కటవుతుండటంతో అటు దేవరకొండ అభిమానులు, ఇటు రష్మిక ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వకుండా రిసార్ట్ దగ్గర కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News