SSMB29 షూటింగ్ అప్డేట్.. బాలీవుడ్‌ హీరోతో షూట్.. ఇంతకీ ఎక్కడంటే?

Update: 2025-01-20 08:34 GMT

Mahesh Babu and Rajamouli movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తప్ప.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినప్పటికీ అది కూడా సీక్రెట్ గానే పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రాలేదు. కానీ నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం వైరల్ అవుతూనే ఉంది.

తాజా సమాచారం ప్రకారం.. సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడం తప్ప.. చిత్ర బృందం సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ సోషల్ మీడియాలో మహేష్ బాబుకు, రాజమౌళికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ఇటీవల ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ రావడంతో రాజమౌళి, మహేష్ సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఫిల్మ్ సిటీలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహంతో షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత హాలీవుడ్‌కే పరిమితమైన ప్రియాంక.. ఇప్పుడు తెలుగు సినిమా చేస్తుందనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక రాజమౌళి పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ మార్కెట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సెట్స్‌లో తీయాల్సిన షూటింగ్ అంతా చేసేసి తర్వాత కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం.

ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు కోసం మహేష్ తన లుక్‌ను మార్చేశారు. లాంగ్ హెయిర్ స్టైల్, గుబురు గడ్డంతో మహేష్ ఇటీవల పలు వేడుకల్లో కనిపించారు. కాగా ఈ సినిమా ఓ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని రచయిత విజేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై రోజురోజుకి మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడేళ్లు అయినా పడుతుందని టాక్ వినిపిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీలో పాల్గొనగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News