Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్‌

Jr NTR: తెలుగు రాష్ట్రాల ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో వారిని ఆదుకునే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు.

Update: 2024-09-03 05:33 GMT

Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్‌

Jr NTR Donation: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, రైల్వే ట్రాకులు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిర్వాసితులయ్యారు. రూ. కోట్ల నష్టం వాటిల్లింది. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వాలు చర్యలు చేట్టాయి.

ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చేరో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ విషయాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన జూనియర్‌.. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా’ అని రాసుకొచ్చారు.

ఎన్టీఆర్‌ చేసిన పనికి ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. నిజంగా ఎన్టీఆర్‌ది గొప్ప మనసు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు మరికొందరు హీరోలు సైతం తమ వంతు సాయం అందిస్తారో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే జూనియర్‌ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోందీ మూవీ. 

Tags:    

Similar News