Gene Hackman: జీన్ హ్యాక్‌మన్, భార్య బెట్సీ, పెంపుడు కుక్క అనుమానాస్పద మృతి
Gene Hackman's family found dead: ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మన్, ఆయన భార్య బెట్సీ అరకవ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. వారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. న్యూ మెక్సికోలోని హ్యాక్‌మన్ ఇంట్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి జరిగిన ఈ మూడు మరణాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే, ఘటన స్థలంలో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి వారి మృతికి గల కారణాలు కూడా పోలీసులు చెప్పలేకపోతున్నారు.
హాలీవుడ్‌లో అందరి చేత గౌరవ మర్యాదలు పొందిన అతికొద్ది మంది నటులలో జీన్ హ్యాక్‌మన్ ఒకరు. యాక్షన్, థ్రిల్లర్స్, కామెడీ... ఇలా అన్ని జానర్లలో ఆయన సినిమాలు చేశారు.
ఈ ఘటనపై న్యూ మెక్సికో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు తరువాతే ఏ విషయమైంది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు వెల్ఫేర్ చెకింగ్ కోసం వెళ్లినప్పుడే ఈ విషయం తెలిసిందని వారు ఉంటున్న ప్రాంతమైన శాంటా ఫీ కౌంటి పోలీసులు తెలిపారు.
జీన్ హ్యాక్‌మన్ వయస్సు 95 ఏళ్లు. అనేక హాలీవుడ్ సినిమాల్లో ఆయన నటించారు. ఐదుసార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ఆయన కెరీర్లో మొత్తం రెండుసార్లు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నారు. మొదటిసారిగా ది ఫ్రెంచ్ కనెక్షన్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఆ తరువాత 21 ఏళ్లకు అన్‌ఫర్‌గివెన్ సినిమాతో ఆయన ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు.
మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ ప్రకటన రానుంది. అదే సమయంలో సీనియర్ నటుడు చనిపోవడం హాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1980 లో ఆయన శాంటా ఫి కౌంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు.