Yash Rangineni: ‘ఛాంపియన్’తో హాట్ టాపిక్.. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యశ్ రంగినేని
Yash Rangineni: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యశ్ రంగినేని ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Yash Rangineni: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యశ్ రంగినేని ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి, తన మేనల్లుడు విజయ్ దేవరకొండతో కలిసి ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఆ తర్వాత నిర్మాతగా ‘దొరసాని’, ‘డియర్ కామ్రేడ్’, ‘ఏబీసీడీ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘భాగ్ సాలే’ వంటి విభిన్నమైన కథాంశాలున్న చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. ముఖ్యంగా ‘పెళ్లి చూపులు’ సినిమాకు జాతీయ అవార్డు రావడం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
నిర్మాతగానే కాకుండా నటుడిగానూ తన సత్తాను నిరూపించుకుంటున్న యశ్ రంగినేని తాజాగా జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ‘ఛాంపియన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రోషన్ మేక హీరోగా నటించిన ఈ సినిమాలో యశ్ రంగినేని పోషించిన వీరయ్య పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఓ చదువు లేని గ్రామీణ వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచే ఈ పాత్రలో యశ్ రంగినేని పూర్తిగా ఒదిగిపోయారు. తక్కువ మాటలు, లోతైన భావాలు, అంతర్లీనంగా రగిలే అగ్ని జ్వాలలను చూపిస్తూ ఆయన చేసిన నటన సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీరయ్య పాత్రలో ఆయన సహజత్వం, సున్నితమైన హావభావాలు ప్రేక్షకుల్ని గట్టిగా తాకుతున్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ఛాంపియన్’ చిత్రంతో యశ్ రంగినేని నటుడిగానూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. నిర్మాతగా మంచి సినిమాలను అందించడమే కాకుండా, నటుడిగా కూడా విలువైన పాత్రలతో ముందుకు సాగుతున్న యశ్ రంగినేని ప్రయాణం ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తోంది.