Paanch Minar Movie Review: పాంచ్‌ మినార్ రివ్యూ.. నవ్వులు, ట్విస్టుల క్రైమ్ కామెడీ!

Paanch Minar movie Review: రాజ్ తరుణ్ నటించిన తాజా క్రైమ్ కామెడీ చిత్రం 'పాంచ్ మినార్'.

Update: 2025-11-20 14:16 GMT

Paanch Minar Movie Review: పాంచ్‌ మినార్ రివ్యూ.. నవ్వులు, ట్విస్టుల క్రైమ్ కామెడీ!

Paanch Minar movie Review: రాజ్ తరుణ్ నటించిన తాజా క్రైమ్ కామెడీ చిత్రం 'పాంచ్ మినార్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రేపు (నవంబర్ 21) థియేటర్లలో విడుదల కానుంది. అయితే, విడుదలకి ఒక రోజు ముందు మీడియాకు వేసిన స్పెషల్ ప్రీమియర్ రివ్యూ ఇది. ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించిందో, అలరించిందో తెలుసుకుందాం.

కథాంశం

కృష్ణచైతన్య అలియాస్‌ కిట్టు (రాజ్‌ తరుణ్‌) తన ప్రేయసి ఖ్యాతి (రాశి సింగ్‌) కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెబుతాడు. కానీ, ఎక్కువ డబ్బు సంపాదించడానికి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఒక రోజు కిట్టు క్యాబ్‌లో ఎక్కిన ఇద్దరు కిరాయి హంతకులు అతని కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్ చోటు (రవి వర్మ)ను హత్య చేస్తారు.

ఈ హత్యకు సుపారీగా వారికి రూ. 5 కోట్లు దక్కుతాయి. ఐదు కోట్లు తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ హంతకులు పోలీసులకు చిక్కుతారు. అదే సమయంలో ఆ 5 కోట్లు మాయం అవుతాయి.

మరి ఆ డబ్బు ఏమైంది? ఎవరు దొంగిలించారు? కిరాయి హంతకులు, సీఐ (నితిన్ ప్రసన్న) ఎందుకు కిట్టు వెంట పడతారు? ఈ గందరగోళంలో కిట్టు ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి 5 కోట్లు ఎవరికి దక్కాయి? అసలు 'పాంచ్ మినార్' టైటిల్‌కి కథకు ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

'పాంచ్ మినార్' అనేది రొటీన్ కథాంశం అయినప్పటికీ, ఆద్యంతం నవ్వులు పంచుతూ ఆసక్తిగా మలచిన క్రైమ్ కామెడీ చిత్రం. సులువుగా డబ్బు సంపాదించాలనుకునే ఓ యువకుడు తెలియకుండానే ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ప్రధాన కథ.

దర్శకుడు రామ్ కడుముల క్రైమ్ కామెడీ జోనర్‌కు తగ్గట్టుగా కామెడీని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చక్కగా బ్యాలెన్స్ చేశారు. నటీనటుల నుంచి కామెడీని రాబట్టడంలో, ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచే థ్రిల్లింగ్ సీన్స్ రాయడంలో ఆయన సఫలమయ్యారు. ఓ వైపు నవ్వుకుంటూనే, మరోవైపు ఏం జరగబోతుందనే ఆసక్తిని పెంచేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది.

హైలైట్స్:

చోటు హత్య తర్వాత కథనం వేగం పుంజుకుంటుంది. పాంచ్‌ మినార్‌ అనే పదం కిట్టు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూపించడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌ సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది.

సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే వేగంగా నడుస్తుంది. డబ్బుని, ప్రాణాలని దక్కించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగా పండాయి.

అక్కడక్కడా వచ్చే చిన్నపాటి ట్విస్టులు థ్రిల్‌ని కలిగిస్తే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. కొత్త రకమైన స్క్రీన్ ప్లే, మంచి టేకింగ్‌తో దర్శకుడు రామ్ కడుముల ఆకట్టుకున్నాడు.

సాంకేతికత & నటన:

కిట్టు పాత్రలో రాజ్ తరుణ్ నటన ఆకట్టుకుంది. అమాయకత్వం, కష్టాల్లోని యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. రాశి సింగ్ గ్లామర్‌తో ఆకర్షించింది. మిగతా నటీనటులు బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర క్యారెక్టర్లు నవ్విస్తూ, కథనానికి బలాన్ని ఇచ్చాయి.

శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదు. ముఖ్యంగా బీజీఎమ్ సన్నివేశాలకు తగినట్టుగా హైలెట్‌గా నిలిచింది. నిర్మాతలు మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే.

ఓవరాల్‌గా చెప్పాలంటే...

వల్గారిటీ లేకుండా, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా నవ్వుకునేందుకు, థ్రిల్‌ని అనుభవించేందుకు 'పాంచ్ మినార్' ఒక మంచి ఎంపిక. కొత్త స్క్రీన్ ప్లేతో, ట్విస్టులతో కూడిన ఈ క్రైమ్ కామెడీ అలరిస్తుంది.

రేటింగ్: 3/5

Tags:    

Similar News