Om Shanti Shanti Shantihi Review: ఓం శాంతి శాంతి శాంతిః రివ్యూ : మలయాళ మ్యాజిక్ తెలుగులో పండిందా?

Om Shanti Shanti Shantihi Review: మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాను తెలుగులో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2026-01-30 08:25 GMT

Om Shanti Shanti Shantihi Review: మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాను తెలుగులో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. వెర్సటైల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ క్రేజీ రీమేక్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ

గోదావరి జిల్లా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శాంతి (ఈషా రెబ్బా) కథ ఇది. ఇంట్లో మగవారికి ఒక రూల్, ఆడవారికి ఒక రూల్ అనే వివక్ష మధ్య పెరుగుతుంది. తన ఇష్టాలను చంపుకుని ఇంట్లో వారు కుదిర్చిన ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) తో పెళ్లికి సిద్ధపడుతుంది. చేపల చెరువుల వ్యాపారం చేసే ఓంకార్, చూడ్డానికి సాఫ్ట్ గా ఉన్నా.. పెళ్లయ్యాక తన అసలు నైజాన్ని బయటపెడతాడు. ప్రతి చిన్న విషయానికి శాంతిపై చేయి చేసుకుంటూ వేధిస్తుంటాడు. భర్త దెబ్బలకు భయపడి విలవిలలాడే శాంతి, ఒకానొక దశలో తిరగబడుతుంది. ఆమె ఇచ్చిన ఆ ‘షాక్’ ఏంటి? అహంకారంతో ఊగిపోయే ఓంకార్ కు శాంతి ఎలా బుద్ధి చెప్పింది? అనేదే మిగతా సినిమా.

విశ్లేషణ

ఓటీటీ యుగంలో పరభాషా సినిమాలను ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులకు, మళ్ళీ అదే కథను రీమేక్ చేసి చూపించడం పెద్ద సాహసమే. అయితే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ విషయంలో మేకర్స్ తెలుగు నేటివిటీని అద్దడంలో సక్సెస్ అయ్యారు. గోదావరి జిల్లా నేపథ్యం, అక్కడి యాస, మధ్యతరగతి మనస్తత్వాలను కథలోకి చక్కగా ఇమడ్చారు. క్లైమాక్స్ లో చేసిన చిన్న మార్పు మినహా కథ మొత్తం ఒరిజినల్ ను అనుసరించింది.భార్యాభర్తల మధ్య గొడవలను సీరియస్ గా కాకుండా, సెటైరికల్ గా, ఫన్నీగా చూపించడం ఈ సినిమా ప్రధాన బలం.

ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాకు అతిపెద్ద బలం తరుణ్ భాస్కర్. భార్యను కొట్టే బాధ్యత లేని భర్తగా, అమాయకత్వం నటిస్తూనే అహంకారం చూపించే ఓంకార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ఈషా రెబ్బా నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ, ఒరిజినల్ లో ఉండే ఆ 'అమాయకత్వం' ఆమెలో కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఆమె రూపం మొదటి నుంచి కాస్త ధైర్యవంతురాలిగా అనిపించడం వల్ల సింపతీ ఫ్యాక్టర్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం

డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా మహిళా వివక్షపై వేసిన సెటైర్లు ఆలోచింపజేస్తాయి. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా సాగాయి. సినిమా నిడివి తక్కువగా ఉండటం బోర్ కొట్టించకుండా కాపాడుతుంది.

బాటమ్ లైన్

మలయాళ ఒరిజినల్ వెర్షన్ చూడని వారికి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఒక క్రేజీ రైడ్ లా అనిపిస్తుంది. చూసిన వారికి మాత్రం కొన్ని సీన్లలో పోలికలు కనిపించి ఎమోషన్ కొంచెం తగ్గొచ్చు. అయినప్పటికీ, తరుణ్ భాస్కర్ నటన కోసమైనా ఈ సినిమాను హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.

పంచ్ లైన్: ఈ శాంతి.. యుద్ధానికి రెడీ

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News