Karmanye Vadhikaraste Review: విద్యార్థుల హత్యలు, హనీట్రాప్, కిడ్నాప్‌లు.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న కర్మణ్యే వాధికారస్తే..!
Karmanye Vadhikaraste Review: ఇటీవల కాలంలో సస్పెన్స్ కథాంశం ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి.
Karmanye Vadhikaraste Review: విద్యార్థుల హత్యలు, హనీట్రాప్, కిడ్నాప్‌లు.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న కర్మణ్యే వాధికారస్తే..!
Karmanye Vadhikaraste Review: ఇటీవల కాలంలో సస్పెన్స్ కథాంశం ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఆ కోవలో నేడు థియేటర్లలోకి వచ్చింది కర్మణ్యే వాధికారస్తే. ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉంది? ఇందులో నటించిన బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ ప్రేక్షకులను మెప్పించారా? అనేది చూద్దాం.
కథ
'కర్మణ్యే వాధికారస్తే' సినిమా కథ మూడు వేర్వేరు, కానీ ఒకదానితో ఒకటి ముడిపడిన కేసుల చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ నటుడు పృథ్వీ (పృథ్వీ) కారు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఈ కేసును ఏసీపీ అర్జున్ (శత్రు) దర్యాప్తు చేస్తాడు. చనిపోయిన వ్యక్తి నకిలీ చిరునామాతో ఆధార్ కార్డు క్రియేట్ చేసుకుని నగరానికి వచ్చాడని తేలడంతో, ఈ కేసు ఒక పెద్ద మిస్టరీగా మారుతుంది. అలాగే సిటీలో అమ్మాయిలను ట్రాప్ చేసి, లైంగికంగా వేధించి, హత్యలు చేస్తున్న యాడ్ ఫిల్మ్ మేకర్ జై (మాస్టర్ మహేంద్రన్) ఉదంతం. హంతకుడి గురించి ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో, ఈ కేసును చేధించడానికి ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుంది. సస్పెండైన హెడ్ కానిస్టేబుల్ కీర్తి (బ్రహ్మాజీ) డ్యూటీలో ఉన్నప్పుడు తీవ్ర గాయాలతో ఉన్న ఓ యువతిని చూసి ఆసుపత్రిలో చేర్చుతాడు. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందని తేలడంతో, ఆ నేరస్థులెవరో తెలుసుకోవడానికి కీర్తి స్వయంగా దర్యాప్తు మొదలుపెడతాడు.
ఈ మూడు కేసుల వెనుక ఎవరున్నారు? ఆపరేషన్ జిస్మత్ మ్యాటర్, జిష్ణు అనే పేర్లతో నడుస్తున్న అసలు కథ ఏమిటి? హనీ ట్రాప్ చేసింది ఎవరు? ఈ కేసులన్నీ ఒకే తాటిపైకి ఎలా వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
సినిమా విశ్లేషణ
దర్శకుడు అమర్ దీప్ ఈ చిత్రాన్ని మన రోజువారీ వార్తల్లో కనిపించే విద్యార్థుల హత్యలు, మిస్సింగ్, హనీట్రాప్ లాంటి అంశాల ఆధారంగా తెరకెక్కించడం విశేషం. దర్శకుడు సినిమా మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు సస్పెన్స్‌ను బాగా కొనసాగించగలిగారు. మూడు వేర్వేరు ట్రాక్‌లు గందరగోళంగా అనిపించినా, ప్రతీ ట్విస్ట్ వెల్లడైనప్పుడు అసలు కథ అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ మూడు కేసుల దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా తీర్చిదిద్దారు.
సెకండాఫ్ అసలు కథ మొదలవుతుంది. మూడు కేసుల వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటి? అనేది ఇక్కడ రివీల్ అవుతుంది. కథలో వచ్చే ఒక కీలకమైన పాత్ర రివీల్ చేసే ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. రోజువారీ సమస్యలను ప్రస్తావించినా, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే, సినిమా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేది. కొన్ని సన్నివేశాల్లో ఉన్న గందరగోళం సెకండాఫ్‌లో క్లారిటీ వచ్చినా, ఫస్ట్ హాఫ్‌లో చూసే ప్రేక్షకుడికి కాస్త కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఎక్కువగా నెగెటివ్ రోల్స్ చేసిన శత్రు ఏసీపీ అర్జున్‌గా మెయిన్ లీడ్‌లో ఆకట్టుకున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు చక్కగా సరిపోయాయి. యాడ్ ఫిల్మ్ మేకర్ జై పాత్రలో మాస్టర్ మహేంద్రన్ నటన అద్భుతం. అతని పాత్ర సినిమాకే అతిపెద్ద ట్విస్ట్‌లలో ఒకటిగా నిలిచింది. చాలా కాలం తర్వాత బ్రహ్మాజీ మళ్లీ హెడ్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది.
ఇతర నటులు: బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధ, ఇతర నటులంతా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి సినిమాకు బలం చేకూర్చారు.
చివరగా
కర్మణ్యే వాధికారస్తే అనేది నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సున్నితమైన అంశాలను, క్రైమ్‌ను ఆధారంగా చేసుకుని తీసిన ఒక భిన్నమైన ప్రయత్నం. సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.
రేటింగ్: 2.75/5