Thyroid Symptoms: థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలంటే డైట్‌లో ఈ మార్పులు తప్పనిసరి.. లేదంటే ముప్పే!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలను అత్యధికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో 'థైరాయిడ్' ఒకటి.

Update: 2026-02-17 12:01 GMT

Thyroid Symptoms: థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలంటే డైట్‌లో ఈ మార్పులు తప్పనిసరి.. లేదంటే ముప్పే!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలను అత్యధికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో 'థైరాయిడ్' ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్య బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. థైరాయిడ్ అనేది కేవలం హార్మోన్ల అసమతుల్యత మాత్రమే కాదు.. ఇది మన శరీర మెటబాలిజం నుంచి మానసిక స్థితి వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇంతకీ థైరాయిడ్ అంటే ఏమిటో తెలుసా.. మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథిని థైరాయిడ్ అంటారు. ఇది మన శరీర జీవక్రియను నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు ఎక్కువైనా (హైపర్ థైరాయిడిజం) లేదా తక్కువైనా (హైపో థైరాయిడిజం) శరీరంలో సమస్యలు మొదలవుతాయి.

థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

* అధిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం.

* శరీరంలో అయోడిన్ లోపించడం లేదా మరీ ఎక్కువ కావడం.

* గర్భధారణ సమయంలో కలిగే హార్మోన్ల మార్పులు.

* వంశపారంపర్యంగా రావడం.

థైరాయిడ్‌తో బాధపడే వారు వీటికి దూరంగా ఉండండి..

థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే ఈ కింది ఆహారాలను మీ రోజు వారి భోజనంలో భాగం చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. బయట దొరికే వేపుళ్లు, నూనెలో వేయించిన పదార్థాలు బరువు పెంచుతాయి, ఇది థైరాయిడ్ రోగులకు ప్రమాదకరం అన్నారు. స్వీట్లు, సోడాలు, తెల్ల చక్కెరను సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నారు. సోయా బీన్స్ లేదా సోయా పాలు ఎక్కువగా తీసుకుంటే, అవి మీరు వాడే థైరాయిడ్ మందుల పనితీరును దెబ్బతీస్తాయని చెప్పారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి వాటిని పచ్చిగా తినకూడదని, బాగా వండుకుని మితంగా తీసుకోవచ్చని అన్నారు. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు.

మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి ..

* తాజా ఆకుకూరలు, పండ్లు రోజూ తీసుకోవాలి.

* పప్పు ధాన్యాలు, పెరుగు, పనీర్, గుడ్లు శరీరానికి బలాన్నిస్తాయి.

* గుమ్మడి గింజలు, వాల్‌నట్స్ వంటి వాటిలో ఉండే జింక్, సెలీనియం థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి.

* తగినంత నీరు తాగడం, పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి బరువు అదుపులో ఉంటుంది.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 సూత్రాలు పాటించండి..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ప్రతిరోజూ 30 నిమిషాల నడక లేదా యోగా చేయడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుందన్నారు. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. హార్మోన్ల స్థాయిని తెలుసుకోవడానికి ప్రతి 3 లేదా 6 నెలలకోసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు.

Tags:    

Similar News