Planning Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఫోలిక్ యాసిడ్ ఎందుకు తప్పనిసరి?
Planning Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మహిళలు ఫోలిక్ యాసిడ్ ఎందుకు తీసుకోవాలి? గర్భం దాల్చడానికి ముందే దీని ప్రాధాన్యత, మోతాదు, లాభాలు తెలుసుకోండి.
Planning Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఫోలిక్ యాసిడ్ ఎందుకు తప్పనిసరి?
Planning Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మహిళలు ఫోలిక్ యాసిడ్ ప్రాధాన్యతను తప్పక గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన శిశు జననానికి ఇది కీలకమైన పోషకమని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చడానికి ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల శిశువులో మెదడు, వెన్నెముక సంబంధిత లోపాలను నివారించవచ్చని వెల్లడించారు.
విటమిన్ B9 యొక్క కృత్రిమ రూపమైన ఫోలిక్ యాసిడ్ శరీరంలో కణాల పెరుగుదల, DNA నిర్మాణం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నవారిలో మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నాలుక వాపు, మూడ్ మార్పులు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
గర్భం దాల్చిన 21 నుంచి 28 రోజులలోనే శిశువు న్యూరల్ ట్యూబ్ అభివృద్ధి చెందుతుందని, ఈ దశలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే స్పైనా బైఫిడా వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది గర్భస్రావం, నెలలు నిండకముందే ప్రసవం అయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని డాక్టర్లు తెలిపారు.
వైద్యుల సలహా మేరకు గర్భం దాల్చాలని ప్లాన్ చేస్తున్న మహిళలు కనీసం ఒక నెల ముందే రోజుకు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. గర్భధారణ మొదటి మూడు నెలల వరకు దీనిని కొనసాగించడం అవసరమని పేర్కొన్నారు. అధిక బరువు, మధుమేహం లేదా పిసిఓఎస్ ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ సూచనలతోనే మోతాదు నిర్ణయించుకోవాలని సూచించారు.
ఆకుకూరలు, పప్పుధాన్యాలు, సిట్రస్ పండ్లు వంటి ఆహారాల్లో ఫోలేట్ సహజంగా లభించినప్పటికీ, గర్భధారణ అవసరాలకు సప్లిమెంట్లు అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే విటమిన్ B12 లోపం ఉన్నవారు ఫోలిక్ యాసిడ్‌ను స్వయంగా అధిక మోతాదులో తీసుకోవద్దని, తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.