నేడు వైసీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక

Update: 2019-05-25 00:32 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహణ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంత్రివర్గం ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. నేటి ఉదయం పదిన్నరకు తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వైసీపీ ఎమ్మెల్యేలు లాంఛనంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అలాగే ఉదయం పదకొండున్నరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో వైసీపీ పార్లమెంటరీ నేతను జగన్ ఎంపిక చేయనున్నారు. ఇక వైసీఎల్పీ సమావేశం ముగిశాక నేటి మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలవనున్న జగన్‌ ఎల్పీ తీర్మాన కాపీ అందజేయనున్నారు.

నేడు వైసీఎల్పీ మీటింగ్ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ ఆహ్వానాలు పంపింది. తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ సమాచారం ఇచ్చారు. దాంతో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తాడేపల్లి బాటపట్టారు. ఇదిలా ఉంటే, ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించడంతో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలనే దానిపై అటు వైసీపీ వర్గాలు ఇటు అధికార యంత్రాంగం సరైన వేదిక కోసం పరిశీలన చేస్తున్నారు.

Similar News