ఏపీలో ఓట్ల తొలగింపు కలకలం

Update: 2019-03-04 11:29 GMT

ఏపీలో ఓట్ల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలగిపోతున్నాయి. ఇలా రెండు నెలల్లో ఈసీకి 9లక్షల దరఖాస్తులు అందాయి. మా ఓట్లు తొలగించండి మహా ప్రభో అంటూ దరఖాస్తులందుతున్నాయి. ఇదంతా కావాలనే చేస్తున్నారని ఫారం -7 ద్వారా ఓట్ల తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో మాకు తెలియకుండా ఎలా తొలగిస్తున్నారంటూ జనం మండిపడుతున్నారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల గల్లంతు వ్యవహారం రచ్చలేపుతోంది.ఓటర్లకు తెలియకుండానే ఓట్లకు రెక్కలు వస్తున్నాయి. మా ఓటు తీసేయండి మహాప్రభో అంటూ రెండు నెలల్లో 9 లక్షల దరఖాస్తులు ఈసీకి చేరాయి. అయితే, ఇదంతా కావాలనే చేస్తున్నారని ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ, వైసీపీ ఆరోణలు చేసుకుంటున్నాయి.ఓ వైపు ఫేక్ సర్వేల వ్యవహారం, మరోవైపు డేటా చోరి కలకలం, ఇంకోవైపు ఫామ్ 7 తో ఓట్ల తొలగింపు ఇలా ఏపీలో ఎన్నికల ముందే ఓట్లు రాజకీయం రాజుకుంది.

ఎన్నికలు సమీపిస్తోందంటే ఫారం 6 దరఖాస్తులు వెల్లువలా ఎలక్షన్ కమిషన్‌కు చేరుతాయి. ఈసారి దీనికి విరుద్దంగా ఫారం 7 దరఖాస్తులు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి.ఫారం 7 దరఖాస్తులు లక్షల్లో వస్తుండడంతో కూపీలాగిన ఈసీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది.ఫేక్ ఐడీలతో, నకిలీ పేర్లతో ఓట్లు తొలగిస్తున్న తీరు చూసి అవాక్కవుతున్నారు.పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు అక్రమ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమేనని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించిందని చెబుతున్నారు కలెక్టర్లు. ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతోనే ఇతరులు ఫారం–7 సమర్పించారని, ఆన్‌లైన్‌ ద్వారా ఇటువంటి తప్పుడు, అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేస్తున్నారు. మొత్తంమీద ఏపీలో ఎప్పుడు ఎవరి ఓటు గల్లంతవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరి మీ ఓటు ఉందో లేదో సరిచూసుకోండి. 

Similar News