గవర్నర్‌తో జగన్‌, కేసీఆర్‌ కీలక భేటీ

Update: 2019-06-01 13:04 GMT

గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చిన జగన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకోగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అక్కడికి చేరుకొని గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌‌లో ఇఫ్తార్‌ విందు కోసం వచ్చిన ఇద్దరు సీఎంలు గవర్నర్‌ నరసింహన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఏపీ పునర్విభజన చట్టంలోని కొన్ని అంశాలపై వివాదాలు ఐదేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని అంశాలతో పాటు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు అప్పగింత, ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులతో పాటు ఉద్యోగుల విభజన తదితర సమస్యలపై గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్టు సమాచారం. ఈ సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలో తొలిసారి గవర్నర్‌ సమక్షంలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన అంశాలపై ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, తదుపరి వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు.

Similar News