వైసీపీ టాప్ గేర్...

Update: 2019-03-29 03:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జోరందుకొంది. మూడు ప్రధానపార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలలో ప్రచారం చేస్తుంటే వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సైతం ఎన్నికల ప్రచారం బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి మూడురోజులపాటు విజయమ్మ, షర్మిల వేర్వేరుగా ప్రచారం నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన అధినేతలు వివిధ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేస్తూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలను చుట్టిరావడానికి వీలుగా హెలీకాప్టర్లను ఉపయోగిస్తున్నారు.

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వివిధ నియోజకవర్గాలలో సింగిల్ మ్యాన్ షోగా ప్రచారం నిర్వహిస్తుంటే ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సైతం ప్రచారం బరిలోకి దిగబోతున్నారు. జగన్ పర్యటించకుండా విడిచిపెట్టిన నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం చేయటానికి వీలుగా ఇటు విజయమ్మ అటు షర్మిల వేర్వేరుగా కార్యక్రమాలు సిద్ధం చేసుకొన్నారు.

ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలలో మార్చి 29న విజయమ్మ ప్రచారం నిర్వహిస్తారు. 30న ఎర్రగొండపాలెం, మాచర్ల నియోజకవర్గాలలో జరిగే ప్రచార కార్యక్రమాలలో విజయమ్మ పాల్గొంటారు. అంతేకాదు ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస,పాతపట్నం నియోజకవర్గాలలో ఈనెల 31 న విజయమ్మ ప్రచారం చేస్తారు.

మరోవైపు వైఎస్ షర్మిల మాత్రం మంగళగిరి నియోజకవర్గం నుంచి తన ప్రచారకార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ బరిలోకి దిగిన మంగళగిరి నియోజకవర్గం లో షర్మిల విస్త్రుతంగా ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం పైనా లోకేశ్ పనితీరుపైన షర్మిల ప్రధానంగా విమర్శల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది. మార్చి 29న మంగళగిరి నియోజవర్గం లో ప్రచారం తర్వాత 30 న గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలలో షర్మిల ప్రచారం చేయనున్నారు. మార్చి 31న తాడికొండ, పెదకూరపాడు, నర్సరావుపేట నియోజకవర్గాల పరిధిలో షర్మిల ప్రచారం చేపట్టనున్నారు. మొత్తం మీద జగన్, తల్లి, సోదరితో కలసి ఓట్ల వేటకు ముప్పేట దాడి చేస్తున్నారు.

Similar News