వైసీపీ జాబితా ... అందుకే వాయిదా!

Update: 2019-03-14 03:14 GMT

జగన్‌ మరోసారి జనంలోకి వెళ్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత మళ్లీ ప్రజలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్రలో కవర్‌ కాని నియోజకవర్గాలతో సహా ముఖ్యమైన నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16 న ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి బయల్దేరి వెళ్లనున్నారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ ఎన్నికల సమయంలో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను రూపొందించడంలో తలమునకలైన జగన్‌ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 16 న ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

అయితే బుధవారం పోటీ చేసే అభ్యర్థుల తొలి లిస్టును విడుదల చేయాలని భావించిన జగన్‌ ప్రచారం ప్రారంభించే రోజునే అభ్యర్థుల పూర్తిస్థాయి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజున ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత 175 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేయనున్నారు. తర్వాత ప్రచారానికి బయల్దేరి వెళ్లనున్నారు.

ప్రచారంలో మొదటి సభ గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో ఉంటుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. పాదయాత్రలో కవర్‌ కాని నియోజకవర్గాలకు తోడు సుమారుగా 75 నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి ప్రచారంలో హెలికాప్టర్‌ను కూడా ఉపయోగిస్తామని వివరించారు. ఎన్నికల నాటికి వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జగన్‌ సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. 

Similar News