జమ్ములమడుగులో అభ్యర్థులు మారారు..మరి ఫలితం మారేనా?

Update: 2019-05-08 10:09 GMT

కడప జిల్లాలో ఇప్పుడు అందరి కళ్లు జమ్మలమడుగు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఒకప్పటి చిరకాల ప్రత్యర్ధులు చేతులు కలిపి ఒక్కటై, ఎన్నికల్లో పొటీ చేస్తే, మరోవైపు మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఓ యువ వైద్యుడు, వైఎస్ఆర్ కుటుంబ మద్దతుతో ఎన్నికల్లో పోటీకి దిగారు. అసలే ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడం, పాత ప్రత్యర్ధులు ఏకమై ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీచెయ్యడం, వైసీపీ నుంచి ఎలాంటి రాజకీయ అనుభవం లేని వైద్యుడు రంగంలోకి దిగడంతో, ఈసారి ఇక్కడి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. అటు చంద్రబాబు, ఇటు జగన్‌లు జమ్ములమడుగును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వ్యూహప్రతివ్యూహాలు అమలు చేశారు. మరి ఫ్యాక్షన్‌ గడ్డ జమ్ములమడుగులో ఈసారి ఓటరన్న ఎలా ఆలోచించాడు. ఎవరిని గెలిపించాడు? పోలింగ్ సరళి ఏమంటోంది?

కడప జిల్లాలో ఫ్యాక్షన్‌, వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు జమ్ములమడుగు నియోజకవర్గం. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే దశాబ్దాలుగా పోరు సాగింది. పార్టీలు కాకుండా వ్యక్తులే కేంద్రంగా ఈ నియోజకవర్గ రాజకీయం నడుస్తొంది. ఓటర్లు కూడా ఇలాంటి తీర్పులే ఇస్తుంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కొంత వైవిధ్యం కనపడుతోంది.

దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి పొన్నపురెడ్డి, చదిపిరాళ్ల కుటుంబాలు కలిసికట్టుగా టీడీపీ తరుపున బరిలో దిగారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగాను, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగాను పోటీచేశారు. వైసీపీ తరుపున వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధమున్న డాక్టర్ సుధీర్ రెడ్డి జమ్మలమడుగు నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, మరోవైపు ఉరకలేసే ఉత్సాహం, పార్టీలకు కాకుండా వ్యక్తులకే ప్రాధాన్యమిచ్చే ఇక్కడి ఓటర్లు, ఈ పర్యాయం ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.

జమ్ములమడుగు నియోజకవర్గంలో మొత్తం 2,23,913 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 1,10,000, మహిళలు 1,13,893 మంది. దీంతో ఇక్కడ మహిళా ఓటర్లదే కీలక పాత్ర. ప్రస్తుత ఎన్నికల్లో లక్షా 60 వేలమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా, సుమారు 85.40 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ప్రతి మండలంలోను 82 శాతానికి మించే ఓటింగ్ శాతం రికార్డయ్యింది. నియోజకవర్గంలో గతంలో పలు గ్రామాల్లో ఏజెంట్లను కూడా కూర్చబెట్టలేని పరిస్ధితులుండేవి. కానీ ఈసారి గతంలో లేనివిధంగా ఎన్నికలు జరిగాయని చెప్పొచ్చు. ప్రతి ఎన్నికల్లో ఫ్యాక్షన్ గొడవలతో ఎన్నికలు రక్తసిక్తమయ్యేవి. కానీ పోలీసులు కూడా ప్రకడ్బందీగా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడగలిగారు. దీంతో ఏ పార్టీ కూడా ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకునే అవకాశం లేకుండాపోయింది. అయితే ఇలా ఎన్నికలు సజావుగా జరగడం కూడా ఇక్కడి ఫలితంపై ఉత్కంఠ పెంచుతోంది.

ఇంత రసవత్తరంగా ఎన్నికలు జరిగినా గెలుపుపై ఎవరి ధీమా వారిదే, ఎవరి కారణాలు వారివే. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రత్యేకించి పసుపు కుంకుమ, పెన్షన్ల పెంపు వంటివి తమ విజయానికి దోహదపడుతుందని టిడిపి భావిస్తోంది. అంతేకాకుండా కేంద్రం సహకరించకపోయినా స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు శంకుస్థాపన చెయ్యడం, గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకురావడం తమకు లాభిస్తాయని తెలుగుదేశం కాన్ఫిడెన్స్. వీటికితోడు నియోజకవర్గంలో బలమైన వర్గాలుగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం కూడా టిడిపి విజయం కోసం పనిచేసిందని అభ్యర్ధి రామసుబ్బారెడ్డి నమ్మకంగా చెబుతున్నారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గం ఎంత వరకు పనిచేసిందన్నది కూడా తేల్చాల్సింది ఫలితమే.

వైసీపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇరువర్గాలు కలవడం మొదలుకొని ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలు తమ విజయానికి కారణం కానున్నాయని చెబుతోంది. వైఎస్ఆర్ మరణం తరువాత నియోజకవర్గం అభివృద్ది ఎక్కడికక్కడ నిలిచిపోయిందని అంటోంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్‌కు బలమైన అభిమాన వర్గం ఉందని, ఈ కారణాలతో తప్పక ఈ ఎన్నికల్లో తమదే విజయమని వైసీపీ చెబుతొంది. జగన్‌ కూడా జమ్ములమడుగును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తంగా ఇరు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తుండటంతో, ఇక్కడి గెలుపోటములపై జిల్లాలోనే కాకుండా రాష్ర్టవ్యాప్తంగా ఆసక్తి కలుగుతోంది. 

Full View

Similar News