అనంతపురం సెగ్మెంట్‌‌లో జెండా ఎగరేసేది ఎవరు?

Update: 2019-05-14 03:12 GMT

అనంతపురం జిల్లా కేంద్రంలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరబోతోంది? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? మరోమారు టీడీపీకే పట్టం కట్టారా. ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారా? జనసేన ఫ్యాక్టర్‌తో టెన్షన్‌ పడుతున్నదెవరు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయి? ఇద్దరు బలమైన అభ్యర్థుల్లో జనం ఎంచుకున్నది ఎవర్ని?

అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి అన్ని పార్టీలకూ హాట్‌ సీట్. టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకం. అంతకుమించి ఇక్కడున్న ప్రముఖ నాయకులకు అత్యంత ప్రతిష్టాత్మకం అనంతపురం శాసనసభ నియోజకవర్గం. ఈసారి కూడా అత్యంత హోరాహోరిగా ఎన్నికలు జరిగాయి. ఈసారి ఇద్దరు బలమైన అభ్యర్థులు అనంతపురం బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయగా, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మరోసారి తొడగొట్టారు.

అనంతపురం నగరంతో పాటు రాజీవ్ కాలనీ, నారాయణపురం, రుద్రంపేట, అనంతపురం పంచాయతీలు నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 2,55,682 మంది ఓటర్లు. అందులో పురుషులు 1,26,711 మంది, స్త్రీలు 1,28,924 మంది. ఇతరుల సంఖ్య 47. ఈ ఎన్నికల్లో 63.58 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 60.3 శాతం పోలింగ్ రికార్డయితే, గతం కంటే 3.28 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్న ఉత్కంఠ నగరంలో నెలకొంది.

ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే వైఎస్ ఆర్ సీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నియోజకవర్గలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రతివార్డులో కలియతిరిగారు. ఆ పార్టీ ప్రవేశ పెట్టిన నవరత్నాలను వివరిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి అందిరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, పట్టణంలో ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. నగరంలోని పలు వార్డుల్లో తమకు ఆధిక్యం వస్తుందన్న ధీమా ఆపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో నెలకొన్న అసమ్మతి, వర్గపోరు ఎన్నికల్లో తమకు లాభించాయని చెబుతున్నారు. ఈసారి అనంతలో అనంత వెంకట్రామిరెడ్డికి ఓటర్లు పట్టం కట్టారని ఆ పార్టీ నేతల నమ్మకం.

టీడీపీ నేతలు కూడా విజయం తమదేనంటున్నారు. గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగిందని, రాత్రి వరకూ, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూతుల్లో వేచి ఉండి ఓట్లు వేశారని చెబుతున్నారు. నగరంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అర్భన్ ఓటర్లు మరోమారు టీడీపీని ఆదరించారని అంటున్నారు.

ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొన్నా, జనసేన అభ్యర్థికి పెద్దఎత్తున ఓట్లు పోలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి టీసీ వరుణ్ తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లతో పాటు జనసైనికుల కుటుంబాల ఓట్లు తమకు పోలయ్యాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఏ పార్టీ ఓట్లను చీల్చింది. ఎవరికి నష్టం చేసిందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ, వైసీపీకి సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు ఈ ఎన్నికల్లో చెదిరిపోయిందా. ఓటర్లు జనసేన వైపు చూశారా అన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

Full View   

Similar News