వీవీ ప్యాట్ స్లిప్పులు బయటకు రావడంపై ఈసీ సీరియస్

Update: 2019-04-17 01:53 GMT

మెన్న ఆత్మకూరులో, నిన్న రాజమండ్రిలో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపుతున్నాయి చెత్తకుప్పల్లో దర్శన మిచ్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు ఎన్నికల యంత్రాగంలో ఆందోళన కలిగిస్తోంది పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ స్లిప్పులు ఎక్కడివి..? డెమో లో ఉపయోగించిన మాక్ పోలింగ్ కి సంబంధించినవా..? లేక ఒరిజినల్ స్లిప్పులా..? ఇప్పుడీ ప్రశ్న సర్వత్రా చర్చనీయాశంగా మారుతోంది..?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చెత్తకుప్పల్లో కనిపించిన వీవీప్యాట్ స్లిప్పులు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి. ఎన్నికల నిర్వహణ పైన అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఈ వ్యవహారం పై ఎన్నికల సంఘం ఇప్పటికే సీరియస్ అయింది. చెత్తకుప్పలో దొరికిన వీవీప్యాట్ స్లిప్పులను కొందరు వ్యక్తులు గమనించి మీడియాకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

అయితే దొరికిన స్లిప్పులపై మరోవాదన కూడా వినిపిస్తోంది. పోలింగ్ కు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్ పోలింగ్ లో భాగంగా ఈవీఎం ద్వారా 50 ఓట్లు వేస్తారు. ఓట్లు కరెక్ట్ గా పడుతున్నాయా లేదా, ఒక గుర్తుకి ఓటు వేస్తే మరో గుర్తుకి ఓటు పడిందా, ఎన్ని ఓట్లు ఒక గుర్తుకి వెయ్యడం జరిగింది ఇలా అన్ని లెక్కలు రాసుకుంటారు. వీవీ ప్యాట్ స్లిప్స్ ప్రకారం ఈవీఎం పనితీరు పరిశీలిస్తారు. ఆ సమయంలో తీసిన వీవీ ప్యాట్ స్పిప్స్ ను సిబ్బంది భద్రపరచాలి. అందుకు విరుద్ధంగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి స్లిప్పులను చెత్తలో పారేశారని అధికారులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం దొరికిన స్లిప్పులు మాక్ పోలింగ్ కు సంబంధించినవా, లేక ఓటింగ్ జరిగిన తర్వాత వీవీ ప్యాట్ నుంచి బయటకు తీశారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాఫ్తు జరుగుతోంది. ఈ విషయం ఏపీ సీఈవో ద్వివేది దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాలని అన్నారు. మొత్తానికి నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో చెత్తకుప్పల్లో దర్శనమిచ్చిన వీవీప్యాడ్ స్లిప్‌లు.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి. 

Similar News