ఇవాళ రాజ్యసభలో తలాక్ బిల్లు..

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

Update: 2018-12-31 04:25 GMT
Triple Talaq Bill

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు విషయమై పెద్దల సభలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యే అవకాశాలున్నాయి. తక్షణ తలాక్‌ను నేరంగా పరిగణిస్తున్న ప్రస్తుత బిల్లును యథాతథంగా ఆమోదించే ప్రసక్తి లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేయడంతో బిల్లు విషయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో నెగ్గించుకున్న బీజేపీకి రాజ్యసభలో చిక్కులు తప్పేలా లేవు. రాజ్యసభలో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి సంఖ్యా బలం తక్కువ కావడంతో బిల్లు విషయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గనిచ్చేది లేదని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నిలువరించేందుకు విపక్షాలు ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు ప్రతిపాదిత తీర్మానంపై 116 మంది సభ్యులు సంతకాలు చేశారు. లోక్‌సభలో ప్రభుత్వం తనకు గల మెజారిటీతో బిల్లును ఆమోదించుకోగలిగిందని కొందరు విపక్ష సభ్యులు చెప్పారు. ఈ బిల్లులో పలు రాజ్యాంగ వ్యతిరేక అంశాలు ఉన్నాయని, దీన్ని జాయింట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని విపక్షాలు పట్టుబట్టనున్నాయి. ఈ బిల్లును లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నదని, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న నిబంధనలను సవరించాల్సి ఉన్నదని విపక్ష సభ్యులు చెబుతున్నారు.

ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నిబంధనలు, విధానాలను తెలిపే 125 రూల్‌ను ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రస్తుత రూపంలో రాజ్యసభలో ఆమోదించనివ్వబోమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ బిల్లును ఓడించేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలతో చేతులు కలుపుతామని వేణుగోపాల్ చెప్పారు. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్పష్టమైన ఆదేశాలు పంపాయి. 

Similar News