బావ బావమరుదుల యుద్ధంలో విజేత ఎవరు?

Update: 2019-05-10 09:18 GMT

ఇద్దరూ బావ, బావమరుదులు. కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు చెరో పార్టీలో చేరి, ప్రత్యర్థులయ్యారు. ఒకరిపై మరొరకు పైచేయి సాధించడానికి ఎత్తుకుపైఎత్తులు వేశారు. ఇంతకుముందే రెండుసార్లు వైరివర్గాలుగా తలపడ్డారు. ముచ్చటగా మూడోసారి యుద్ధంలో కత్తులు దూశారు. సిక్కోలు జిల్లాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ బావ, బావమరుదులు తలపడుతున్న ఆముదాలవలస నియోజకవర్గం. ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ టీడీపీ నుంచి రంగంలోకి దిగితే, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైసీపీ నుంచి సై అన్నారు. మరి ఓటేసిన జనం, ఈ బావ బావమరుదుల్లో ఎవర్ని ఆశీర్వదించారు?

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో పోటీ ఇంట్రెస్టింగ్‌గా‌ సాగింది. సొంత బావబావరుదులు, రాజకీయ రణక్షేత్రంలో కత్తులు దూశారు. తమ్మినేని సీతారం, కూన రవికుమార్‌లు సై అంటే సై అంటూ కత్తులు దూశారు. తమ్మినేని సీతారాం టీడీపీలో ఒకప్పుడు సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావం తర్వాత 1983, 85ల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచారు. 1989లో ఓడినా మళ్లీ 1994, 99ల్లో అదే పార్టీ నుంచి గెలిచారు. తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేశారు. కానీ అనూహ్యగా 2004 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి ఇక్కడి నుంచే బరిలోకి దిగగా ఆయనపై ఆయన బావమరిది కూన రవికుమార్‌ టీడీపీ తరపున పోటీచేశారు. ఓట్లు చీలిపోవడంతో కాంగ్రెస్‌ ఇక్కడ గెలిచి తమ్మినేని రెండో స్థానంలో రవి మూడో స్థానంలో నిలిచారు. తమ్మినేని మళ్లీ టీడీపీలో చేరి కొద్దికాలం తర్వాత వైసీపీలోకి జాయినయ్యారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బావ తమ్మినేనిపై సునాయాసంగా గెలుపొందారు రవి. సీఎం చంద్రబాబు ఆయన్ను ప్రభుత్వ విప్‌గా అపాయింట్ చేశారు. ఇప్పుడు ఉభయులూ అవే పార్టీల నుంచి మరోసారి రణక్షేత్రంలోకి దిగారు. ఇద్దరూ వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, పోటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస, పొందూరు, సరబుజ్జిలి, భూర్జ మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. కళింగులు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్ లో కాపు, వెలమ సామాజిక వర్గాలు తరువాతి స్థానంలో ఉన్నాయి. మొత్తం 1,87,744 ఓటర్లు కలిగిన ఆముదాలవలసలో, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 78.51 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఇందులో 73,246 మంది పురుషులు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 74,140 మహిళలు ఓటు వేశారు.

2014 ఎన్నికల్లో ప్రధాన హామీలను పరిశీలిస్తే ఆముదాలవలస కో ఆపరేటివ్ షుగర్ ఫాక్టర్ పునఃప్రారంభం, భూర్జమందలంలోని నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ, సరబుజ్జిలి మండలంలోని ముంపు ప్రాంతాలను రక్షించడం, పొందూరు మండలానికి సాగు,తాగునీరు అందించడం, రైల్వే స్టేషన్ సమీపంలో అండర్ టన్నెల్ వంటివి ఉన్నాయి. ఇదిలా ఉంటె మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో పోటాపోటీగా ప్రచారం చేశారు తమ్మినేని, కూన రవికుమార్. ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ సరళిని బట్టి ఎవరికీ వారు గెలుపు తమదంటే తమదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ అభ్యర్ధి కూన రవికుమార్ విషయానికి వస్తే, గడిచిన ఐదేళ్ళ పాలనలో తాను చేసిన అభివ్రుది, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ఆముదాలవలస మునిసిపాలిటీలో కోట్ల రూపాయలతో తాను చేసిన అభివృద్ధి , నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకోని నారాయణపురం ఆనకట్ట విషయంలో తాను సాధించిన విజయం తన గెలుపుకు దోహదపడతాయని నమ్మకంతో ఉన్నారు కూన రవి. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, వృద్దులకు, వికలాంగులకు పెన్షన్ రెట్టింపు, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని, ఆ వర్గాల ఓట్లన్నీ తమ ఖాతాలోకే చేరాయనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఇక వైసీపీ అభ్యర్ధి తమ్మినేని సీతారాంది కూడా అంతే ధీమా. నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేత కావడంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి తనకు విజయం చేకూరుస్తుందనే భావనలో ఉన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి అంశాలు తనకు అనుకూలంగా ఉన్నాయని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు తమ్మినేని. వీటితో పాటు జగన్ వేవ్, నవరత్నాలు, మేనిఫెస్టో , పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామన్న అభివృద్ధి పనులు, అందిస్తామన్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కంచుకోటలో టీడీపీ మరోమారు జెండా ఎగరవేస్తుందా, లేక అధికార పార్టీ కోటను ప్రతిపక్ష వైసీపీ బద్దలు కొడుతుందా అసలు ప్రజలు తీర్పు ఏవిధంగా ఉండబోతోంది తెలియాలంటే ఫలితాలు వెలువడే మే 23 వరకు ఈ సస్పెన్స్ కొనసాగక తప్పదు.

Full View

Similar News