జగన్ అపాయింట్మెంట్ కోసం టీడీపీ నేతల వెయిటింగ్..!

Update: 2019-05-30 04:57 GMT

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరి కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జగన్ ఆహ్వానించినా చంద్రబాబు హాజరుకాలేకపోవడంతో టీడీపీ తరఫున ముగ్గురు ప్రతినిధులు కలిసి అభినందనలు తెలుపుతారని అధిష్టానం ప్రకటించింది. నేటి ఉదయం జగన్‌కు అభినందనలు తెలిపేందుకు పార్టీ ప్రతినిధులను పంపాలని టీడీపీ నిర్ణయించింది. అయితే టీడీపీ ప్రతినిధులకు ఇంతవరకూ జగన్‌ అపాయింట్‌మెంట్ ఖరారుకాలేదు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ, అంతకన్నా ముందుగానే ఆయన్ను కలవాలని మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లను చంద్రబాబు పంపించారు. కొద్దిసేపటి క్రితం వీరు ముగ్గురూ జగన్ వద్దకు బయలుదేరారు. కాగా, తమకు ఉదయం 11 గంటల్లోపు జగన్ అపాయింట్ మెంట్ కావాలని వీరు కోరినట్టు తెలుస్తోంది. ఇంకా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మరో వైపు జగన్ ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు భారీగా తరలి వస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అర్ధరాత్రి సమయంలోనే స్టేడియం వద్దకు చేరుకున్న అభిమానులతో ప్రస్తుతం ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఇప్పటికే జగన్ ప్రమాణం చేసే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జనంతో నిండిపోయింది. 11 గంటల 54 నిమిషాలకు జగన్ ఇంటి నుంచి బయలుదేరుతారు. 12 గంటల 5 నిమిషాలకు జగన్ స్టేడియంకు చేరుకుంటారు. 12 గంటల 23 నిమిషాలకు జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Similar News