60 ఏళ్లుగా నీళ్లలోనే మునిగి ఉన్న ఆలయం

Update: 2019-05-17 14:43 GMT

అదో పురాతన శివాలయం దక్షిణకాశీగా ప్రసిద్ది చెందిన గుడి. అరణ్యవాసం సమయంలో సాక్ష్యాత్తు శ్రీరాముడు ప్రతిష్టించిన మహిమాన్విత లింగం. ఐదు దశాబ్దాల్లో ఏడుసార్లు మాత్రమే బయటపడింది. గోదావరి గర్భంలో వెలసిన ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

ఉత్తర తెలంగాణ వరప్రదాయనీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో అతి పురాతన రామలింగేశ్వరాలయం మరోసారి బయటపడింది. ఏళ్ల తరబడి నీటిలో మునిగిపోయిన ఈ ఆలయం శ్రీరాంసాగర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో బయటకు వచ్చింది. ఉప ఆలయాలు ఇంకా నీటిలోనే మునిగి భక్తులకు దర్శనమిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత నీటి నుంచి బయటపడ్డ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని స్ధానిక గ్రామస్ధులు శుభ్రం చేశారు. మట్టితో నిండిపోయిన ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు మహాదేవుడికి ధూపదీప నైవెద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాత కుస్తాపురం శివారులో బయటపడ్డ పురాతన రామ లింగేశ్వరాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు గోదావరి పరివాహాక ప్రాంతంలో పర్యటిస్తూ ఈ శివలింగాన్ని కుస్తాపురం శివారులోని గోదావరిలో ప్రతిష్టించినట్లు స్ధలపురాణం చెబుతోంది. ఆలయం ప్రస్తుతం బయటకు రావటం చాలా సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్ధులు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కుస్తాపురం దాని చుట్టు పక్క గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కుస్తాపురంలో వెలసిన రామలింగేశ్వరాలయ ఉప ఆలయాలు నీట మునిగాయి. కరవు పరిస్ధితులు, ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో రామలింగేశ్వరాలయం బయట పడుతుంది. అలా బయటపడినప్పుడే శివలింగ దర్శనం కలుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తైన ఐదు దశాబ్దాల్లో ఇప్పటి వరకు రామలింగేశ్వరస్వామి ఏడుసార్లు దర్శమిచ్చారని స్థానికులు చెబుతున్నారు.

రామలింగేశ్వస్వామి ఆలయం 60 ఏళ్లుగా గోదావరి గర్భంలోనే ఉంది. ఏళ్ల తరబడి నీటిలోనే ఉన్నా ఆలయం చెక్కు చెదరలేదు. ఆలయం ఆలనా పాలన లేక బోసిపోగా స్ధానిక గ్రామస్ధులు దూప ధీపాలు పెట్టి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇన్నాళ్లు నదిలో ఉన్న పురాతన ఆలయం బయటపడటంతో ఇసుకలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. 




 















 















 



Similar News