అధికార పార్టీలో కొలిక్కిరాని సీట్ల లొల్లి

Update: 2019-03-07 13:30 GMT

టీడీపీలో టికెట్ల పంచాయతీ రోడ్డెక్కింది. నేతలకు వ్యతిరేకంగా కార్యకర్తలు, అసమ్మతి వాదులు నిరసనలు తెలుపుతున్నారు. మరోమారు సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వద్దంటూ అనంతపురం నుంచి అమరావతి వరకు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అనంతపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అసమ్మతి సెగ తప్పలేదు. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40శాతం మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు.

మాజీ ఎంపీ సైఫుల్లా తనయుడు జకీఉల్లా జయరాం నాయుడు సహా పలువురు కార్పొరేటర్లు రోడ్డెక్కారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాలో బలిజలకు టీడీపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వద్దంటూ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి బాహాటంగా చెబుతున్నారు. దీపక్ రెడ్డి వర్గం కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. పుట్టపర్తిలో పల్లెరఘునాథరెడ్డికి అసమ్మతి సెగ తగులుతోంది. పల్లె రఘునాథరెడ్డికి అనుకూల, వ్యతిరేక వర్గీయులు పోటాపోటీగా నిరసనలు తెలుపుతున్నారు.

కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వేలమందితో ఆందోళనలు కొనసాగించారు. వ్యతిరేక వర్గాన్ని హెచ్చరిస్తూనే ఎమ్మెల్యే వర్గం పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుంతకల్లు, శింగనమలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ్ముళ్లు గళం విప్పుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దని పట్టుబడుతున్నారు. 

Similar News