కన్నతండ్రికి కడసారి కన్నీటి సెల్యూట్‌

Update: 2019-02-16 10:09 GMT

ఉగ్రమూకల ఉన్మాదానికి బలైన జవాన్ల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటున్నాయి. దేశ రక్షణలో తిరిగి రాని లోకాలకు వెళ్లిన అమరుల త్యాగాల పట్ల యావత్‌ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ఒక్కటై ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 40 మంది జవాన్ల కుటుంబాలకు 130 కోట్ల మంది ప్రజలు అండగా ఉంటారని భరోసా ఇస్తున్నారు. ముష్కరుల చేతిలో బలైన వీర జవాన్లకు యావత్‌ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. కుటుంబసభ్యులు, బంధువుల అశ్రు నయనాల మధ్య అమర జవాన్లకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

డెహ్రాడూన్‌కు చేరుకున్న సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి మోహన్‌లాల్‌ కుమార్తె కడసారిగా సెల్యూట్‌ చేసింది. కన్నీటిని దిగమింగుకుని ఆమె సెల్యూట్‌ చేసిన తీరు అక్కడివారిని కలిచివేసింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల నేతలు మోహన్‌లాల్‌కు నివాళులర్పించారు. 

Similar News