రాజమండ్రిలో జనసేనాని ఎన్నికల శంఖారావం

Update: 2019-03-14 04:04 GMT

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు రాజమహేంద్రవరం ముస్తాబైంది. ఇవాళ సాయంత్రం జరిగే సభ నుంచి పవన్ ఎన్నికల శంఖారావం పూరించమబోతున్నారు. రాజమండ్రి సభలో జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది.

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ వేదికగా ఇవాళ సాయంత్రం జనసేన సభ ఆవిర్భావ సభ జరుగుతుంది. జనసేన పార్టీ ఆవిర్భవించి గురువారానికి ఐదేళ్లు పూర్తవ్వడంతో యుద్ధ శంఖారావం పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నారు. సభకు 13 జిల్లాల నుంచి జన సైనికులు తరలివస్తున్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాటయాత్ర నిర్వహించి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై కవాతు నిర్వహించారు. లక్షలాది జనంతో ఆ కవాతు విజయవంతమైంది. అదే తరహాలో ఇవాల్టి సభకు కూడా ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత పవన్‌కల్యాణ్‌ పాల్గొంటున్న మెదటి సభ ఇదే అవుతుంది. జనసేన యుద్ధ శంఖారావానికి రామహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు నిర్వహించిన తర్వాత సాయంత్రం సభ ప్రారంభమవుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే జనసేన ప్రకటించిన విజన్ మేనిఫెస్టోలో వంట గ్యాస్, నెలకు మూడువేలు, కేజీ టూ పీజీ విద్య, ఉచిత విద్యుత్, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, ఎకరానికి 8 వేల సాయం ప్రకటించారు. రాజమండ్రి సభలో పవన్ మరిన్ని వరాలు కురిపించే అవకాశం వుంది. తొలిసారిగా జనసేన ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో రాజమండ్రి సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

Similar News