నాగబాబు ఎంట్రీ.. నరసాపురంలో త్రిముఖ పోటీ..

Update: 2019-03-20 11:13 GMT

 పవన్ కల్యాణ్ సోదరుడు, సినీనటుడు నాగబాబు జనసేనలో చేరారు. పార్టీ అధినేత పవన్, జనసేన కండువా కప్పి నాగబాబును పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాగబాబును జనసేనకు బాగా పట్టున్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ అభ్యర్ధిగా ప్రకటించారు. దొడ్డిదారిలో కాకుండా రాజమార్గంలో నాగబాబును ప్రజాక్షేత్రంలో నిలబెడుడుతున్నట్లు తెలిపారు.

నామినేషన్లకు తుది గడువు దగ్గర పడుతున్నకొద్దీ జనసేన వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించి, విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దింపిన పవన్ కల్యాణ్‌ ఇప్పుడు మరో కీలక స్థానానికి నాగబాబును అభ్యర్ధిగా ప్రకటించారు. నాగబాబుకి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబును బరిలోకి దింపుతున్నట్లు అనౌన్స్ చేశారు. అక్కడికక్కడే నాగబాబుకు బీ-ఫామ్‌ కూడా అందజేశారు.

అన్న నాగబాబు వల్లే తనకు రాజకీయ చైతన్యం మొదలైందన్నారు జనసేనాని. తానే నాగబాబును రాజకీయాల్లోకి ఆహ్వానించానన్న పవన్‌ తన సూచన మేరకే నరసాపురం నుంచి పోటీకి ఒప్పుకున్నారని అన్నారు. దొడ్డిదారిలో కాకుండా రాజమార్గంలో నాగబాబును ప్రజాక్షేత్రంలో నిలబెడుడుతున్నట్లు తెలిపారు. సొంత తమ్ముడే అయినా తనకు కూడా పవనే నాయకుడని నాగబాబు అన్నారు. టికెట్‌ ఇచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు తమ్ముడి స్ఫూర్తితో సత్తా చూపిస్తానన్నారు.

నాగబాబు ఎంట్రీతో నరసాపురం పార్లమెంట్‌ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు టీడీపీ నుంచి శివరామరాజు పోటీపడుతుండగా ఇప్పుడు నాగబాబు రాకతో పోరు రసవత్తరంగా మారనుంది. ఈ త్రిముఖ పోటీలో మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాలి.

 

 

Similar News