సర్వేకు సన్యాసమేనా..ఆయన అన్నట్లుగానే...

Update: 2019-05-24 07:13 GMT

అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. లగడపాటి సర్వేలకు అర్ధాలే వేరులే ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ సర్వే పేరు వింటే ఏపీ ప్రజలు ఇలానే ఫీల్ అవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల్లో ఒకసారి తప్పులో కాలేసిన ఈ మాజీ ఎంపీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అట్టర్ ఫ్లాపైయ్యాడు.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మరోసారి అట్టర్ ఫ్లాపైంది. ఇదివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమికి అనుకూలంగా సర్వే ఇచ్చి అప్రతిష్టపాలైన లగడపాటి మరోసారి తప్పులో కాలేశారు. అసలేమాత్రం పోలిక లేని సర్వే ఫలితాలు ఇచ్చిన లగడపాటి టీడీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనీ, మహిళల ఓట్లు ఆ పార్టీకే పడ్డాయనీ చెప్పారు. 90 నుంచీ 110 స్థానాలు టీడీపీకి వస్తాయని గొప్పగా చెప్పారు.

అంతటితో ఆగకుండా తన సర్వేను నమ్మాల్సిన పనిలేదంటూనే అత్యంత లోతుగా సర్వే చేశాననీ, ఇది తనకు జీవన్మరణ పోరాటం అనీ, కచ్చితంగా సరైన ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత, భారం తనపై ఉందనీ చెప్పారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది ఏపీలో టీడీపీ సీన్ సితారైంది లగడపాటి ఇచ్చిన సర్వేకి పూర్తి విరుద్ధంగా ఇంకా చెప్పాలంటే అసలేమాత్రం పోల్చుకోవడానికి కూడా వీల్లేని ఫలితాలు వెల్లడయ్యాయి.

మరోవైపు బెట్టింగ్ మాఫియా చేతులో లగడపాటి అమ్ముడుపోయాడని అందుకే టీడీపీకి అనుకూలంగా సర్వే చెప్పాడని వైసీపీ ఆరోపిస్తోంది చంద్రగిరిలో టీడీపీని గెలిపించే కుట్రతోనే ఎగ్జిట్ పోల్స్ కి ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కారని లగడపాటి చెప్పారన్నవిమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

తన సర్వే రెండుసార్లు తప్పైతే ఇక తన సర్వేల ఫలితాలు తెలుసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరనీ, అందువల్ల ఇకపై తాను గోడలకే సర్వేల ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తుందని లగడపాటి స్వయంగా అన్నారు. ఇప్పుడు ఆయన అన్నట్లుగానే రోండోసారి సర్వే కూడా తప్పింది ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు స్వస్థి చెప్పినట్లే లగడపాటి సర్వేలకు కూడా స్వస్థి పలకాలని ప్రజలు అంటున్నారు. 

Similar News