కేరళలో కొనసాగుతున్న నిరసనలు.. మోడీ పర్యటన రద్దు

కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదాపడింది. కేరళలో ఆదివారం జరగాల్సిన మోడీ పర్యటన వాయిదా పడినట్లు ఓ ప్రకటనలో

Update: 2019-01-05 14:20 GMT

కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదాపడింది. కేరళలో ఆదివారం జరగాల్సిన మోడీ పర్యటన వాయిదా పడినట్లు ఓ ప్రకటనలో తెలిపిన బీజేపీ, తుదపరి ఎప్పుడు పర్యటిస్తారో వెల్లడించలేదు. కేరళలో అల్లర్లు సద్దుమణిగిన తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. జనవరి 2న ఇద్దరు 50 ఏళ్ల లోపు మహిళల శబరిమల ఆలయ ప్రవేశాన్ని నిరసిస్తూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హిందూ సంఘాలకు చెందిన ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులు, సీపీఎం కార్యకర్తల ఆస్తులపై దాడులకు పాల్పడుతూ హింసాత్మక ఆందోళనలు చేపడుతున్నారు. అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇళ్లపై సీపీఎం కార్యకర్తలు ప్రతిదాడులకు దిగుతుండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ, సీపీఎం కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.

నిన్న రాత్రి సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంసీర్ ఇంటిపై ఆందోళనకారులు నాటుబాంబు విసరగా సీపీఎం కార్యకర్తలు బీజేపీ ఎంపీ వీ మురళీధరన్ ఇంటిపై నాటు బాంబుల దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో ఎంపీ ఇంట్లో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కన్నూర్‌లో సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత చంద్రన్‌పై సీపీఎం కార్యకర్తలు దాడికి దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురైయ్యారు.

ఇప్పటి వరకు 1,369 మందిని అరెస్టు చేసిన పోలీసులు, 717 మందిని ముందస్తుగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. హింసాత్మక ఘటనకు సంబంధించి 801 కేసులు నమోదయ్యాయి. హింసాత్మక ఘటనల్లో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చంద్రన్ ఉన్నితన్ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇద్దరు సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేశారు. సీపీఎం కార్యకర్తలు విసిరిన రాయి తగిన చంద్రన్ మృతి చెందినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తుండగా ఇందులో వాస్తవం లేదని, గుండెపోటు కారణంగా చంద్రన్ మృతిచెందినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. 

Similar News