పులివెందులలో జగన్‌ ట్యాక్స్‌‌: చంద్రబాబు

Update: 2019-04-01 13:40 GMT

రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా పులివెందులను తయారు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన టీడీపీ రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్‌ ట్యాక్స్‌ నడుస్తోందని, రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వీటన్నింటినీ అరికడతామన్నారు. ''పులివెందులలో జీఎస్టీ మాదిరిగా జేఎస్టీ (జగన్‌ ట్యాక్స్‌) ఉంది. 20శాతం వసూలు చేస్తున్నారు. ఇలాంటి ట్యాక్స్‌ ఎక్కడా చూడలేదు. ఈ ఆటలు మా వద్ద సాగవు. ట్యాక్స్‌ వసూలుచేసే అధికారం ఎవరిచ్చారు? కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్‌ వర్గానిది. పులివెందుల అభివృద్ధి గురించి జగన్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి నీళ్లు వచ్చేవి కాదని, ఇక్కడికి నీళ్లు తెప్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. పులివెందులలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే బాధ్యత, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత తనదని చెప్పిన చంద్రబాబు, పులివెందులను ఉద్యాన పంటల హబ్ గా మారుస్తానని, ఇక్కడ శీతల గిడ్డంగులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Similar News