ఏపీలో షా..కు షాక్

Update: 2019-02-05 05:13 GMT

ఏపీలో బీజేపీ, టీడీపీల మధ్య రాజకీయ రణం ముదురుతోంది. బీజేపీ నేత అమిత్‌ షా టూర్‌కి నిరసన శెగ తగిలింది. అనేక ఉద్రిక్తతల నడుమ షా పర్యటన కొనసాగింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా అమిత్‌ షా పర్యటనతో ఆ వేడి మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బీజేపీ ఏపీ చీఫ్‌ అమిత్‌ షాకు నిరసనల సెగ తగిలింది. పలాసలో టీడీపీ వర్సెస్ బీజేపీతో అమిత్‌ షా పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీజేపీ, టీడీపీల మధ్య వైరం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన రసాబాసగా మారింది.

అమిత్‌ షా సభ నిర్వహించిన పలాసలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. పలాసలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. ఆంధ్రా ద్రోహులు బీజేపీ నాయకులు అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన టీడీపీ శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది.

ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన చట్టంలో 14 అంశాల్లో 10 అంశాలను తాము అమలు చేశామని అమిత్‌ షా తెలిపారు. ఏపీలో 20కి పైగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఏపీకి ఎన్నిచేసినా ఏమీ చేయలేదని చెబుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు గురించి తనకంటే ఏపీ ప్రజలకే ఎక్కువ తెలుసని, తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టి, ఓడిపోయాక ఫ్రంట్‌ అంటున్నారని అమిత్‌ ఆగ్రహించారు. అటు శ్రీకాకుళం జిల్లా పర్యటనలోనూ, ఇటు విజయనగరం జిల్లా పర్యటనలోనూ అమిత్‌ షా పర్యటన నిరసనల మధ్య కొనసాగింది.

Full View

Similar News