రాజంపేట వైసీపీలో టికెట్ రగడ...మేడా రాకతో...

రాజంపేట వైసీపీలో టికెట్ రగడ రాజుకుంటోంది. టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన మేడా‌ మల్లికార్జున్‌‌రెడ్డికి టికెట్‌ ఖాయమన్న ప్రచారం జరుగుతుండటంతో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ ఆకేపాటి అమర్‌‌నాథ్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు.

Update: 2019-01-28 04:52 GMT

రాజంపేట వైసీపీలో టికెట్ రగడ రాజుకుంటోంది. టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన మేడా‌ మల్లికార్జున్‌‌రెడ్డికి టికెట్‌ ఖాయమన్న ప్రచారం జరుగుతుండటంతో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ ఆకేపాటి అమర్‌‌నాథ్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈనెల 31న మేడా వైసీపీలో చేరుతుండటంతో అదే రోజు కీలక నిర్ణయం తీసుకుంటానని ఆకేపాటి ప్రకటించడంతో కలకలం రేపుతోంది.

కడప జిల్లా రాజంపేట వైసీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరడంతో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్‌గా కొనసాగుతోన్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌‌నాథ్‌‌రెడ్డి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మేడా రాకతో జగన్‌‌ను కలిసిన ఆకేపాటికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్‌‌తో మీటింగ్‌ తర్వాత అధినేత చెప్పినట్లే నడుచుకుంటానన్న అమర్‌‌నాథ్‌రెడ్డి రాజంపేట వచ్చాక మండలాల నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బూత్‌ కన్వీనర్లు, మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేడా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఆకేపాటి వర్గీయులు మల్లికార్జున్‌‌రెడ్డికి టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇన్నాళ్లూ తమను ఇబ్బందులకు గురిచేసి కేసుల్లో ఇరికించిన మేడాకు ఎలా మద్దతివ్వాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక పలువురు మద్దతుదారులైతే ఆకేపాటి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు.

తాను పార్టీకి విధేయుడనే అయినా కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇస్తానన్న అమర్‌నాథ్‌రెడ్డి టికెట్‌ తనకే ఇస్తారనే నమ్మకంతో ఉన్నానని అన్నారు. ఈనెల 31వరకు ఆగాలని మద్దతుదారులకు సూచించిన ఆకేపాటి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఉద్వేగంతో చెప్పారు. అయితే అదే రోజు మేడా వైసీపీలో చేరుతుండటంతో రాజంపేట వైసీపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

Similar News