జర భద్రం.. కరోనా పీడ అంత తొందరగా మనల్ని వదలదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక!

Update: 2020-04-23 07:02 GMT
World Health Organisation Director General (file photo)

కొన్ని పీడలు పట్టనే కూడదు.. పడితే అంత తొందరగా వదిలిపోవు. ఇది పెద్దలు చెప్పేమాట. కచ్చితంగా కరోనాకు సూటయ్యే మాట అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చెబుతోంది.

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచం నుంచి అంత త్వరగా వదిలి పోదని మరోసారి WHO అందర్నీ హెచ్చరించింది. వైరస్ అదుపులోకి వచ్చిందని భావించిన కొన్ని దేశాల్లో, కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కనిపిస్తోందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధోనామ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేశారు.

లాక్ డౌన్ కారణంగా స్తంభించిన తమ వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టడానికి చాలా దేశాలు లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆలోచిస్తున్న తరుణంలో WHO ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమ ఐరోపా దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ..ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో ఈ వైరస్‌ తీవ్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో సరిగా వ్యవహరించని కారణంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేయాలని అమెరికా చేసిన వ్యాఖ్యలను టెడ్రోస్‌ తిరస్కరించారు. తాము కరోనా తీవ్రతను ఆదిలోనే పసిగట్టి సరైన సమయంలోనే(జనవరి 30వ తేదీనే) అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించామని తెలిపారు.

ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరైన సమయంలో స్పందించిందని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.డబ్ల్యూహెచ్ఓకు నిధుల నిలిపివేతపై నిర్ణయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News