Trump Warns Venezuela President: 'మాకు అమెరికా సహకారం కావాలి'.. యూ-టర్న్ తీసుకున్న అధ్యక్షురాలు!
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ మెత్తబడ్డారు. అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఆమె యూ-టర్న్ వెనుక ఉన్న అసలు కారణాలు ఇక్కడ చూడండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేయడంతో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఒక్కసారిగా మెత్తబడ్డారు. నిన్నటి వరకు అమెరికాపై నిప్పులు చెరిగిన ఆమె, ఇప్పుడు తమ దేశ అభివృద్ధికి అమెరికా సహకారం కావాలంటూ స్నేహ హస్తం చాచడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
మదురో అరెస్ట్ నుంచి మద్దతు వరకు..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సమయంలో డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్రంగా స్పందించారు. "మా దేశానికి మదురో ఒక్కడే అధ్యక్షుడు" అని ప్రకటించడమే కాకుండా, అమెరికా చర్యను అంతర్జాతీయ వేదికలపై తప్పుబట్టారు. అయితే, ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది.
ట్రంప్ 'పవర్‌ఫుల్' హెచ్చరిక!
డెల్సీ రోడ్రిగ్జ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
"అమెరికాను ఎదిరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, మదురో కంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అని ట్రంప్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు.
ఈ హెచ్చరికతో దిగివచ్చిన రోడ్రిగ్జ్, ఆదివారం రాత్రి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రోడ్రిగ్జ్ ప్రకటనలోని ముఖ్యాంశాలు:
- పరస్పర సహకారం: అంతర్జాతీయ చట్టాల పరిధిలో అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- అభివృద్ధి ఎజెండా: పరస్పర ప్రయోజనాలు, దీర్ఘకాలిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాం.
- సహకారం: వెనెజువెలా పునర్నిర్మాణానికి అమెరికా తోడ్పాటు అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఎందుకీ మార్పు?
వెనెజువెలా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా ఆంక్షలు, మదురో అరెస్టుతో దేశం అల్లకల్లోలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో వైరం పెట్టుకుంటే తన పదవికే కాకుండా, దేశానికీ ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన రోడ్రిగ్జ్, వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.