"The Town Where Death is Illegal: ఇక్కడ చనిపోవడం చట్టవిరుద్ధం.. ఈ వింత ఊరి గురించి తెలిస్తే షాక్ అవుతారు!

నార్వేలోని లాంగ్‌ఇయర్‌బైన్ పట్టణంలో చనిపోవడం చట్టవిరుద్ధం! అక్కడ శవాలను పాతిపెట్టరు, ఎందుకు? ఆ వింత చట్టం వెనుక ఉన్న భయంకరమైన కారణాలు మరియు అక్కడి గడ్డకట్టే వాతావరణం గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

Update: 2026-01-20 08:38 GMT

ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో రకమైన వింత ఆచారాలు, కఠినమైన చట్టాలు ఉంటాయి. కానీ, 'చనిపోవడానికి వీల్లేదు' అనే చట్టం ఎక్కడైనా ఉంటుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. నార్వేలోని లాంగ్‌ఇయర్‌బైన్ (Longyearbyen) అనే పట్టణంలో దశాబ్దాలుగా ఈ వింత చట్టం అమలులో ఉంది. అసలు అక్కడ చనిపోతే ఏం చేస్తారు? శవాలను ఎందుకు పాతిపెట్టరు? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గడ్డకట్టే చలి.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత

నార్వేలోని ఈ ప్రాంతం భూమిపై ఉన్న అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు 3 నుండి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే ఉంటాయి. చలికాలంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. గతంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 46.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయి రికార్డు సృష్టించింది. ఇంతటి గడ్డకట్టే చలి ఉన్నా, అక్కడి ప్రకృతి అందాలను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు.

చనిపోవడం ఎందుకు నేరం?

ఈ పట్టణంలో ఎవరైనా చనిపోతే, వారిని అక్కడే పాతిపెట్టడం లేదా దహనం చేయడం నిషేధం. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం.

కుళ్ళిపోని మృతదేహాలు: ఇక్కడ విపరీతమైన మంచు (Permafrost) ఉండటం వల్ల మృతదేహాలు భూమిలో పెట్టినా కుళ్ళిపోవు. దశాబ్దాల కాలం గడిచినా బాడీలు అలాగే తాజాగా ఉంటాయి.

వ్యాధుల భయం: 1918లో స్పానిష్ ఫ్లూ వల్ల చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలిస్తే, అందులోని వైరస్ ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. శవాలు కుళ్ళిపోకపోతే, వాటిలోని బ్యాక్టీరియా లేదా వైరస్‌లు గాలిలో కలిసి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు.

1950లోనే మూతపడ్డ స్మశానం

పరిస్థితి తీవ్రతను గమనించిన అక్కడి ప్రభుత్వం, 1950లోనే స్థానిక స్మశానవాటికను శాశ్వతంగా మూసివేసింది. అప్పటి నుండి అక్కడ ఎవరూ చనిపోకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే ఏం చేస్తారు?

లాంగ్‌ఇయర్‌బైన్‌లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే లేదా చనిపోయే స్థితికి చేరుకుంటే, వారిని వెంటనే విమానం ద్వారా నార్వేలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఒకవేళ ఎవరైనా హఠాత్తుగా మరణించినా, వారి అంత్యక్రియలు మాత్రం ఆ పట్టణంలో నిర్వహించరు. మృతదేహాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సిందే.

ప్రకృతి వైపరీత్యమో లేక పర్యావరణ పరిరక్షణో కానీ, "చనిపోవడానికి వీల్లేని ఊరు"గా లాంగ్‌ఇయర్‌బైన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

Tags:    

Similar News