Saudi Arabia: అమెరికా, బ్రిటన్ కాదు.. ఈ ముస్లిం దేశం అత్యధికంగా భారతీయులను వెనక్కి పంపింది..షాకింగ్‌ డేటా..!!

Saudi Arabia: అమెరికా, బ్రిటన్ కాదు.. ఈ ముస్లిం దేశం అత్యధికంగా భారతీయులను వెనక్కి పంపింది..షాకింగ్‌ డేటా..!!

Update: 2025-12-27 05:28 GMT

Saudi Arabia: 2025లో విదేశాల నుంచి భారతీయ పౌరుల బహిష్కరణకు సంబంధించిన కీలక గణాంకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో సమర్పించిన అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపించారు. ఈ సంఖ్య గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ గణాంకాల్లో అత్యంత ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే.. అత్యధికంగా భారతీయులను బహిష్కరించిన దేశం అమెరికా లేదా బ్రిటన్ కాకుండా సౌదీ అరేబియా కావడం. కానీ 2025లో సౌదీ అరేబియా ఒక్క దేశమే 11,000 మందికి పైగా భారతీయ పౌరులను బహిష్కరించింది. ఇది మొత్తం బహిష్కరణలలో దాదాపు సగానికి చేరువగా ఉండటం విశేషం. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల సంఖ్య అధికంగా ఉండటం.. అక్కడి కఠినమైన వలస, కార్మిక నిబంధనలు దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

అమెరికా విషయానికి వస్తే.. ఈ ఏడాది అక్కడి నుంచి సుమారు 3,000 మంది భారతీయులను స్వదేశానికి పంపించారు. సంఖ్య పరంగా ఇది సౌదీ అరేబియాతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ.. గత ఐదేళ్లలో అమెరికా నుంచి జరిగిన బహిష్కరణల్లో ఇది అత్యధికం కావడం గమనించాల్సిన అంశం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటీవల ట్రంప్ పరిపాలనలో వలస నిబంధనలను మరింత కఠినతరం చేయడం.. వీసా స్థితి.. పని అనుమతులు.. ఓవర్‌స్టే.. పత్రాల పరిశీలనపై కఠినమైన నిఘా పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి.

ఇతర దేశాల గణాంకాలను పరిశీలిస్తే.. మయన్మార్ నుంచి 1,591 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 1,469 మంది, మలేషియా నుంచి 1,485 మంది, బహ్రెయిన్ నుంచి 764 మంది, థాయిలాండ్ నుంచి 481 మంది, కంబోడియా నుంచి 305 మంది భారతీయులను బహిష్కరించారు. ఈ దేశాలన్నింటిలోనూ వలస చట్టాలు ఉల్లంఘించడం ప్రధాన కారణంగా నమోదైంది.

ఇక విద్యార్థుల విషయానికి వస్తే.. 2025లో అత్యధికంగా భారతీయ విద్యార్థులను బహిష్కరించిన దేశం బ్రిటన్‌గా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది యూకే నుంచి 170 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించారు. వీరి తరువాత ఆస్ట్రేలియా నుంచి 114 మంది, రష్యా నుంచి 82 మంది, అమెరికా నుంచి 45 మంది విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. చదువు నిబంధనలను పాటించకపోవడం, పార్ట్‌టైమ్ పని పరిమితులను మించిపోవడం, వీసా షరతుల ఉల్లంఘన వంటి కారణాలు ఇందుకు కారణాలుగా పేర్కొన్నాయి.

2025లో భారతీయుల బహిష్కరణ గణాంకాలు విదేశాలకు వెళ్లే కార్మికులు, విద్యార్థులు వలస నిబంధనలపై మరింత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. చిన్న తప్పిదం కూడా స్వదేశానికి తిరిగివచ్చే పరిస్థితిని తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News