ఇద్దరు దొంగలు.. పది నిమిషాలు..ఏడువేల కోట్లరూపాయల నగలు లేపేశారు!

సినిమాల్లోనే సాధ్యం అనుకునే విషయాలు ఒక్కోసారి తారస పడతాయి. సరిగ్గా అటువంటిదే ఈ సంఘటన కూడా..

Update: 2019-11-26 10:56 GMT
Stolen Jewelry of German museum: Image source: Twitter/svenja_loves

సినిమాల్లోనే సాధ్యం అనుకునే విషయాలు ఒక్కోసారి తారస పడతాయి. మొన్నా మధ్య నానీ గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఓ ఐదుగురు దొంగలు కల్సి నిమిషాల వ్యవధిలో బ్యాంక్ కొల్ల గొట్టేస్తారు. అచ్చం అలానే కాకపోయినా, దాదాపు అదేవిధంగా కొన్ని నిమిషాల్లో ఏడువేల కోట్ల రూపాయల విలువచేసే నగలను దోచేశారు.

నిమిషాల వ్యవధిలోనే..

జర్మనీ మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఈ భారీ చోరీ జరిగింది. జర్మనీలోని డ్రెస్డెన్‌ నగరంలో విఖ్యాత డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియంలో ఈ భారీ దొంగతనం జరిగింది. కేవలం ఇద్దరు దొంగలు పక్కా స్కెచ్ తో విలువైన ఆభరణాలను లేపేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకునే లోపే నిముషాల వ్యవధిలోనే ఆ భరణాలతో ఉడాయించారు.

ఎలా చేశారంటే..

ముందుగా ఈ చోర శిఖామణులు సోమవారం వేకువజామున మ్యూజియంలోని ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సమీపంలో మంట పెట్టారు. తరువాత సెక్యూరిటీ అలారంను ఆపు చేశారు. కరెంట్ పోవడంతో అక్కడంతా చీకటి మయం అయిపొయింది. ఆ చీకట్లో ఇద్దరూ డ్రెస్డన్ రాయల్ ప్యాలెస్‌లోని గ్రీన్ వాల్ట్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఆభరణాలు ఉంచిన కిటికీని బాధలు కొట్టారు. ఆభరణాలను చేజిక్కించుకుని పారిపోయారు. కరెంట్ పోయినప్పటికీ, ఆ చీకట్లోనే వారు దొంగతనం చేశారు. అదే చీకట్లో అక్కడి సెక్యూరిటీ కెమెరాలు ఈ దొంగతనాన్ని రికార్డు చేశాయి.

ఈ వీడియో ఫోటేజీలను పరిశీలించిన పోలీసులు దొంగల కోసం జల్లెడ పట్టారు. వారు ఊరు విడిచి పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

వెల కట్టలేని ఆభరణాలు..

మ్యూజియం నుంచి దొంగలు ఎత్తుకుపోయిన ఆభరణాల విలువ 7 వేల కోట్లుంటుందని అక్కడి మీడియా చెబుతోంది. అయితే, ఆ ఆభరణాల విలువ లెక్కకట్టడం సాధ్యం కాదని డ్రెస్డెన్స్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్స్ డైరెక్టర్ మారియన్ అక్రెమన్ తెలిపారు. ఆభరణాలను ముక్కలు చేయొద్దొని ఆమె దొంగలకు పిలుపునిచ్చారు. 1723లో ఆగస్టస్ ది స్ట్రాంగ్ ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీనికున్న గ్రీన్ పెయింట్ వల్ల ఈ మ్యూజియానికి గ్రీన్ వాల్ట్‌ అనే పేరొచ్చింది.





Tags:    

Similar News