Dual Citizenship: ఒకే ఊరు.. రెండు దేశాలు.. ఎక్కడ ఉందో తెలుసా?

Update: 2021-08-21 12:45 GMT

Dual Citizenship: ఒకే ఊరు.. రెండు దేశాలు.. ఎక్కడ ఉందో తెలుసా?

Dual Citizenship: సాధారణంగా ఎక్కడైనా గొడవలు సరిహద్దుల దగ్గరే ప్రారంభం అవుతాయి. పొలం..ఇల్లు..ఊరు..రాష్ట్రం..దేశం ఇలా ఎక్కడన్న చిక్కుముడి వీడని సమస్యలు..వివాదాలు సరిహద్దు తోనే ముడిపడి ఉంటాయి. మొన్ననే మన దేశంలో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంతో కర్ఫ్యూ విధించిన పరిస్థితి చూశాం. ఇక ప్రపంచంలో వివాదాలకు సరిహద్దు వివాదాలు ప్రధాన కారణం. కానీ యూరోపియన్ నగరం బార్లీ ఈ విషయంలో అద్భుతమనే చెప్పాలి. ఈ నగరం భౌగోళిక విభజన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెదర్లాండ్స్‌లో సగం నగరం ఉంటుంది.. అటు బెల్జియంలో సగం. ఉంటుంది. ఈ సరిహద్దు రేఖ రోడ్లు, గార్డెన్స్, మ్యూజియంలు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా ఇళ్ల మధ్య కూడా వెళుతుంది. అంటే, చాలా ఇళ్లలో సగం బెల్జియంలో, సగం నెదర్లాండ్స్‌లో ఉన్నాయి.

చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ విభజన ఉన్నప్పటికీ నగరం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ స్ట్రీక్ కూడా ఇక్కడ పర్యాటకంలో ప్రధాన భాగం. పర్యాటకులు రెండు దేశాల మధ్య విభజించబడిన ఇల్లు, వీధి..రహదారిని చూడటానికి.. ఫోటోలు తీయడానికి వస్తారు. ఎర్ర ఇటుకలు, శుభ్రమైన రహదారులతో నగరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక దేశంలో కుర్చీపై కూర్చొని మరొక దేశంలో టీవీ చూడవచ్చు లేదా అడుగడుగునా సరిహద్దులు దాటుతూ నడవవచ్చు. మీరు ఈ నగరానికి వెళితే.. బెల్జియంలో కాఫీ కొనుక్కుని తాగుతూ.. నెదర్లాండ్స్ లో షికార్లు చేయవచ్చు.


నెదర్లాండ్స్ లో ఫోన్ మాట్లాడటం మొదలు పెట్టి అలా అలా నడుస్తూ బెల్జియంలో సరదాగా రౌండ్లు కొట్టొచ్చు. ఇంకా సరదాగా ఉంటే..రోడ్డుమీద ఒక కాలు బెల్జియంలోనూ.. మరోకాలు నెదర్లాండ్స్ లోనూ ఉంచి చక్కగా నడుస్తూ.. రెండు దేశాల్లో నడుస్తున్న అనుభూతి చెందవచ్చు. ఇక ఈ నగరం బెల్జియన్ భాగాన్ని బార్లే హెర్టోగ్ అనీ.. నెదర్లాండ్స్‌ను బార్లే నాసావు అని పిలుస్తారు.

ఒక దేశంగా మారింది కానీ..

1830 సంవత్సరంలో, బెల్జియం నెదర్లాండ్స్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. సరిహద్దు సెట్టర్లు ఉత్తర సముద్ర తీరం నుండి జర్మన్ రాష్ట్రాలకు సరిహద్దును సెట్ చేసారు. కానీ వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సరిహద్దు సమస్యల పరిష్కారం కుదరలేదు. కొంతకాలం తరువాత మళ్ళీ సరిహద్దులు నిర్ణయించినప్పుడు, నగరం రెండు దేశాల్లోనూ స్థిరపడింది.

మరి ఈ నగరంలో ప్రజలు ఏ దేశానికి చెందిన వారనేది ఎలా నిర్ణయిస్తారో తెలుసా? ఇంటి మెయిన్ డోర్ ఏ దేశం వైపు తెరుచుకుంటుందో.. ఆ దేశ పౌరసత్వం ఆ ఇంటిలోని వారికి ఇస్తారు. భలే ఉంది కదూ. ఇక ఈ బార్లీ నగరానికి ఇద్దరు మేయర్లు, రెండు మున్సిపాలిటీలు, రెండు పోస్టాఫీసులు ఉన్నాయి. అయితే వీటన్నింటిపై రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఇది పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరిస్తుంది.

Tags:    

Similar News