Gen-Z uprising Nepal: సోషల్ మీడియా బ్యాన్‌తో మంటల్లో కాఠ్‌మాండూ – ప్రధాని ఓలి రాజీనామా
నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. నేతల అవినీతిని ప్రశ్నించేందుకు దేశ యువతరం నడుం బిగించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో.. కట్టలు తెంచుకున్న యువత ఆగ్రహం..
Gen-Z uprising Nepal: సోషల్ మీడియా బ్యాన్‌తో మంటల్లో కాఠ్‌మాండూ – ప్రధాని ఓలి రాజీనామా
నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. నేతల అవినీతిని ప్రశ్నించేందుకు దేశ యువతరం నడుం బిగించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో.. కట్టలు తెంచుకున్న యువత ఆగ్రహం.. ఆ దేశ ప్రధాని రాజీనామా చేసేలా చేసింది. మాజీ ప్రధానులపై దాడి చేసి వారి నెత్తురు కళ్లజూసే వరకూ వెళ్లింది. సామాజిక మాధ్యమాల ద్వారా దేశ రాజకీయ నాయకుల అవినీతిని దేశ పౌరులు ప్రశ్నిస్తుండటంతో.. అక్కడి ప్రభుత్వం మొత్తం సోషల్ మీడియానే బ్యాన్ చేయాలని నిర్ణయించింది. ఈ ఒక్క నిర్ణయం నేపాల్‌ను మరో బంగ్లాదేశ్‌లా మార్చేసింది.
సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్-జెడ్ ఉద్యమం.. కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్‌మాండూ అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీం కోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలుసహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకూ నిప్పు పెట్టారు. కాంతిపుర్ టీవీ కార్యాలయంపైనా దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలిసహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వారిని దేశం దాటించేందుకు సైన్యం ప్రయత్నిస్తోందన్న వార్తలొచ్చాయి. అయితే ఓలి నేపాల్‌లోనే ఉంటారని తెలుస్తోంది. ప్రధాని రాజీనామా చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో కాఠ్‌మాండూలో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. సైన్యం రంగంలోకి దిగింది. దేశ భద్రత బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలను నిలిపేశారు. సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్‌లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది.
కాఠ్‌మాండూలో పోలీసుల ఫ్లాక్ జాకెట్ ధరించి ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు
అవినీతే అసలు కారణం..
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం.. అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్-జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం భగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్కచేయకుండా కాలంకీ, బనేశ్వర్, చపగాన్, థెకోలలో ఆందోళనలకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించారు. వందల మంది ఆందోళనకారులు ప్రధాని ఓలి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కాల్పుల్లో 19 మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండు చేశారు. దీంతో సైన్యం సూచన మేరకు వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇంటిపై దాడి చేశారు. అంతకుముందు ప్రధానికి చెందిన బాల్‌కోట్‌లోని ఇంటికి నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్ప కమాల్ దహల్‌తోపాటు కమ్యూనికేషన్లశాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు.
బుధానికాంతలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఆయన, ఆయన భార్య అర్జు దేవ్‌బాపై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవ్‌బా కుమారుడు జైబీర్‌కు వాటాలున్న హిల్టన్ హోటల్‌నూ ఆందోళనకారులు తగులబెట్టారు. ్య ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆందోళనకారులు ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్‌పై దాడి చేసిన వీడియో వైరలైంది. కొందరు మంత్రిని వీధుల్లో పరుగెత్తిస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనను కాలుతో తన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. కానీ దూసుకొస్తున్న నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు మళ్లీ పరుగెత్తారు.
మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలించారు. ఎయిర్‌పోర్టువద్ద హెలికాప్టర్ల కదలికలు కనిపించాయి. అలాగే రాజధాని కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి వీఐపీలను తరలించారు.
దల్లులోని మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని ఓలి రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతోపాటు ఇతర భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఇద్దరు నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్‌నాథ్ అధికారి, ప్రదీప్ పౌడెల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు బిమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసి సూచించారు.
నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్‌పై దాడి చేస్తున్న ఆందోళనకారుడు
నేపాల్‌లోనే ఓలి!
ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా చేయగా.. అధ్యక్షుడి ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక ఓలీ దేశం వీడి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్వదేశంలోనే ఉండే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. తదుపరి ప్రధానిగా కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రజలు ఆయన్ను బాలెన్‌గా పిలుస్తుంటారు.
భారత్ అప్రమత్తం
నేపాల్‌లో ఆందోళనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడి భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే భారత ఎంబసీలోని +977-980 860 2881, +977-981 032 6134 నంబర్లను సంప్రదించాలని సూచించింది. భారతీయులెవరూ నేపాల్‌కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది.