కిమ్ తర్వాత ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టబోయే కిమ్ యో జంగ్ గురించి తెలుసా?

Update: 2020-04-27 16:18 GMT
kim yo jung (file Image)

ఉత్తరకొరియా అనగానే యావత్ ప్రపంచానికి గుర్తొచ్చేది ఆ దేశ అధ్యక్షుడే! కిమ్ కుటుంబ వారసత్వపాలనలో 1948 నుంచి కొనసాగుతున్న ఉత్తరకొరియాకు 8 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ పేరు చెబితే చాలు అగ్రరాజ్యం అమెరికా కూడా ఉలిక్కిపడుతుందంటారు. 24 ఏళ్ల వయసులోనే దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ తన విచిత్రమైన వైఖరితో ప్రపంచం నలుమూలలా ప్రజలకు చిరపరిచితుడు అయిపోయాడు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి పై రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

కిమ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారని కొందరూ.. అసలు చనిపోయారని కొందరూ ప్రచారం చేస్తున్నారు. పక్కనే ఉన్న దక్షిణ కొరియా కూడా ఈ విషయంలో రకరకాల కథనాలు చెబుతోంది. ఇప్పటికీ కిమ్ ఏమయ్యరనేది ఎవరికీ స్పష్టంగా తెలీదు. అయితే, కిమ్ చనిపోతే ఆ స్థానం ఎవరితో భర్తీ అవుతుందనే విషయంలో మాత్రం ఊహాగానాలు మొదలయిపోయాయి. వారసత్వ పాలనలో ఉన్న ఉత్తరకొరియాకు.. కిమ్ తరువాత అధ్యక్ష బాధ్యతలు మోసే వయసున్న పిల్లలు లేరు. ఆయన ముగ్గురు పిల్లలూ ఇంకా చిన్నవాళ్ళే. దీంతో ఇప్పుడు కిమ్ వారసత్వం పై ఆసక్తి కర విషయం ప్రచారంలో ఉంది.

కిమ్ ఒకవేళ మరణించినా.. లేక దీర్ఘకాలం అనారోగ్యంతో ఉండిపోవాల్సి వచ్చినా ఆయన స్థానాన్నిభర్తీ చేయడానికి ఆ కుటుంబంలో మరో ఇద్దరు ఉన్నారు. వారిలో కిమ్ సోదరుడు ఒకరు. కిమ్ జోంగ్ చోల్ అనే ఆయనకు రాజకీయాల మీద అసలు ఆసక్తి లేదని చెబుతారు. అయన రాజకీయాలకంటే గిటార్ వాయించడమే ఇష్టం అని అంటారు. అందువల్ల కిమ్ తరువాత అయన అధ్యక్షుడు అయ్యే చాన్స్ లేదు. ఇక మిగిలింది కిమ్ సోదరి కిమ్ యో జోంగ్.

కిమ్ రాజకీయ వారసురాలిగా అయన సోదరి పేరు కిమ్ యో జోంగ్ పేరు ప్రచారంలో జోరుగా ఉంది. ఉత్తరకొరియా అధికార పగ్గాలు మరొకరికి దక్కకుండా.. తమ కుటుంబ పాలనలోనే ఉండాలనేది కిమ్ అభిమతం. అందుకు అనుగుణంగానే అయన చాలా కాలం క్రితమే ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే తన సోదరి కిమ్ యో జోంగ్ ను రెండున్నరేళ్ళ క్రితమే తమ అధికార వర్కర్స్‌ పార్టీలో కీలక బాధ్యతలు కట్టపెట్టారు.

32 ఏళ్ల కిమ్ యో జోంగ్ పార్టీలో కీలక పాత్ర చేపట్టిన నాటి నుంచి అన్ని ముఖ్య సందర్భాల్లోనూ కిమ్ పక్కనే కనిపిస్తూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దక్షిణ కొరియా వేదికగా 2018లో జరిగిన భేటీకి కూడా యో హాజరయ్యింది.

కొరియా రెండుగా విడిపోయిన తర్వాత ఉత్తర కొరియాకు చెందిన అధికార కుటుంబంలోని ఓ మహిళ దక్షిణ కొరియాను సందర్శరించడం ఇదే తొలిసారి. ఇక దక్షిణ కొరియా, అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు, మిలిటరీ వ్యవహారాల్లో ఆమె సేమ్ కిమ్‌కు దీటుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈమెను కిమ్ ను మించిన కఠినాత్మురాలుగా చెబుతారు. కిమ్ సోదరి గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు ఇవే..

* కిమ్ యో జంగ్ ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ అధికార వైస్ డైరక్టర్ గా పని చేస్తున్నారు.

* కిమ్ యో జంగ్ కు వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె కిమ్ జంగ్ ఉన్ లెఫ్టినెంట్ చొ రోయంగ్ హే కుమారుడు చొ సంగ్ ను వివాహం చేసుకున్నారు.

*కిమ్, అతని సోదరి ఇద్దరూ కూడా స్విట్జర్లాండ్ లో ని లిబిఫేల్ద్ స్తేయిన్హోజల్ పబ్లిక్ స్కూల్ లో 1996 నుంచి 2000 వరకూ చదువుకున్నారు. అక్కడ చదువుకునే సమయంలో ఇద్దరూ వారి బంధువుల ఇంట్లో బాడీగార్డుల రక్షణలో పెరిగారు. దీంతో ఇద్దరి మధ్య గట్టి బంధం ఏర్పడిందని చెబుతారు.

* కిమ్ యో జంగ్ కిమ్ II - సంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.

* ఈమె తన తండ్రి కిమ్ జంగ్ వద్ద 2011 లో ఆయన చనిపోయే వరకూ సెక్రటరీగా పనిచేశారు.

* ఈమె 2019 లో ఉత్తరకొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Tags:    

Similar News