అమెరికాలో ట్రంప్ భయానికి పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్... ఎందుకంటే..
అమెరికాలో ట్రంప్ భయానికి పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్... ఎందుకంటే..
Indian students in America: అమెరికాలో డోనల్డ్ ట్రంప్ అక్రమవలసదారులను సొంత దేశాలకు పంపించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్తగా దేశంలోకి వచ్చే వారిపై నియమ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమవలసదారులను గుర్తించే పనిలో అమెరికా ప్రభుత్వం బిజీ అయింది. దీంతో అమెరికాలో మాస్టర్స్ చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ విడిచిపెడుతున్నట్లు ఎన్డీటీవీ వార్తా కథనం చెబుతోంది.
అమెరికాలో బతకాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వారికి ఏ ఇబ్బంది లేదు కానీ అప్పు చేసి వెళ్లిన వారికి మాత్రం పార్ట్ టైమ్ జాబ్స్ తప్పనిసరి అవసరం. "ఊర్లో అప్పులు చేసో లేక పొలాలు అమ్మేసుకునో మాస్టర్స్ డిగ్రీ కోసం, అమెరికాలో భవిష్యత్ కోసం ఇక్కడి వరకొచ్చాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిబంధనలు అతిక్రమించి రిస్క్ తీసుకోలేం" అని ఇండియన్ స్టూడెంట్స్ చెప్పినట్లుగా ఆ కథనం వెల్లడించింది.
జనవరి 20న డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటివరకు అమెరికాలో మాస్టర్స్ చదువుకుంటున్న ఫారెన్ స్టూడెంట్స్ ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యప్పీగా పనిచేసుకున్నారు. కానీ జనవరి 20న ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే ట్రంప్ దాదాపు 80 వరకు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో అక్రమవలదారులను వారి సొంత దేశాలకు వెనక్కు పంపించే పాలసీ కూడా ఉంది. ఆ తరువాతి నుండే అమెరికాలో ఉంటున్న అక్రమవలసదారులకు, చదువకోవడానికి వెళ్లిన విద్యార్థులకు టెన్షన్ మొదలైంది.
పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో అమెరికా రూల్స్ ఏం చెబుతున్నాయి?
అమెరికాలో చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇది F-1 వీసా రూల్. అయితే, ఆ మాత్రమే పనిచేస్తే తమ అవసరాలకు డబ్బులు సరిపోవనే ఉద్దేశంతో చాలామంది విదేశీ విద్యార్థులు ఎంత వీలైతే అంతసేపు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటుంటారు.
రెస్టారెంట్స్, గ్యాస్ స్టేషన్స్, రీటేల్ స్టోర్స్, కేర్ టేకర్స్... ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారానికి ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ఎక్కువే పనిచేస్తుంటారు. కానీ ఇప్పుడలా పరిమితికి మించి పనిచేయడానికి వారు ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోననే భయమే వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
గంటకు 7 డాలర్లు... రోజూ 6 గంటలు పని
ఇల్లినాయిస్‌లో ఉండే అర్జున్ అనే స్టూడెంట్ తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పినట్లుగా ఆ కథనంలో ఉంది. గతంలో తను ఒక చిన్న కేఫ్‌లో రోజుకు 6 గంటలు పనిచేసే వాడిని. గంటకు 7 డాలర్లు ఇచ్చే వారు. కానీ ఇమ్మిగ్రేషన్ రూల్స్ టైట్ అవడంతో గత వారమే తాను ఆ పని మానేశాను. ఎందుకంటే అనధికారికంగా పనిచేసే వారిని ప్రభుత్వం గుర్తించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే అమెరికాలో మాస్టర్స్ చదువుకోవడం కోసం తను 42 లక్షలకుపైనే అప్పుచేశాను. ఆ అప్పు తీర్చాలంటే తను కెరీర్‌ను మరో రిస్క్‌లో పెట్టలేను అని అర్జున్ చెప్పినట్లు ఆ వార్తా కథనం స్పష్టం చేసింది.
ఇది ఒక్కరి సమస్య కాదు..
ఇది ఒక్క అర్జున్ సమస్య మాత్రమే కాదు... అమెరికాలో చదువుకునేందుకు అప్పు చేసి అక్కడికి వెళ్లిన అనేక మంది విదేశీ విద్యార్థుల సమస్య ఇది. "పనిచేసే చోట తనిఖీలు జరిగే ప్రమాదం ఉంది. అక్కడ తాము పరిమితికి మించిన పనివేళలు పనిచేస్తున్నామని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తే... స్టూడెంట్ వీసాను రద్దు చేస్తుంది" అని ఇండియన్ స్టూడెంట్స్ భయపడుతున్నారు. అదే కానీ జరిగితే ఆ తరువాత స్టూడెంట్ వీసా రద్దయిన వారు కూడా అక్రమ వలసదారుల జాబితాలోకే వస్తారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్రమవలసదారులను దేశం నుండి పంపించాల్సి వస్తే... అందులో తమ పేరు లేకుండా చూసుకోవాలనేది ఇండియన్ స్టూడెంట్స్ అభిప్రాయం.
అమెరికాలో పరిస్థితులు చక్కబడే వరకు తాము పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో రూల్స్ అతిక్రమించకుండా ఇండియన్ స్టూడెంట్స్ జాగ్రత్తపడుతున్నారు. అందుకే వారు వారానికి 20 గంటలకు మించి పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమ్మనాన్నల్ని అడగలేక
"ఎక్కువ పని గంటలు పనిచేయడం మానేశాక డబ్బులకు ఇబ్బంది అవుతోంది. ఇప్పటికే దాచుకున్న డాలర్లు కూడా ఖర్చయిపోయాయి. రూమ్ మేట్స్ వద్ద అప్పు చేస్తున్నా. ఇప్పుడు అమ్మనాన్నల్ని అడగాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. కానీ ఇంకొన్ని రోజులకైనా ఆ పని చేయక తప్పేలా లేదు. ఇలా ఎన్ని రోజులు నెట్టుకురావాలో అర్థం కావడం లేదు". ఇది మరో విద్యార్థి ఆవేదన.
ఆ 18000 మంది పరిస్థితి ఏంటి?
ఇప్పటికే అమెరికాలో ప్రాథమిక జాబితా ప్రకారం 18000 మందికిపైగా భారతీయులు అక్కడ అక్రమంగా వలస ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వారిని అమెరికా పంపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు భారత్ కూడా అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని వెనక్కు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, వారు అసలు భారత్‌కు చెందిన వారేనా కాదా అనే వివరాలు చెక్ చేసుకున్న తరువాతే ఆ పని చేస్తామని భారత్ చెబుతోంది. మొత్తానికి అమెరికాలో అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ రాక అక్కడుంటున్న భారతీయులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.