Protests in US: అమెరికాలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా విదేశీయుల ఆందోళన
Protests in US: అమెరికాలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా విదేశీయుల ఆందోళన
Protests against Donald Trump in US: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ విధానాలకు వ్యతిరేకంగా విదేశీయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఎదుట మూడు దేశాలకు చెందిన నిరసనకారులు ఆందోళనకు దిగారు. డోనల్డ్ ట్రంప్ తరచుగా తన ఖాళీ సమయాల్లో కాలక్షేపం కోసం ఈ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వస్తుంటారు. శనివారం మధ్యాహ్నం కూడా ట్రంప్ ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న విదేశీయులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఒక చేత మెక్సికో, గ్వాటేమాల, అమెరికా దేశాల జాతీయ జండాలు పట్టుకున్నారు. మరో చేత అమెరికా అనుకూల నినాదాలతో రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్నారు. అమెరికాలో బతుకుతున్నాం కనుక తాము కూడా అమెరికా అభివృద్ధినే కోరుకుంటామని, తమను శత్రువుల్లా చూడొద్దని నినాదాలు చేశారు. "ఇమ్మిగ్రెంట్స్ మేక్ అమెరికా గ్రేట్" అనే నినాదాలు కూడా చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఏగైన్ (MAGA) అనే డోనల్డ్ ట్రంప్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకునే వారు ఈ నినాదాలు చేశారని అర్థమవుతోంది.
"అమెరికా కలలు కూడా మా కలలే" అని స్పానిష్‌లో రాసి ఉన్న ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. డోనల్డ్ ట్రంప్ కాన్వాయ్ అక్కడి నుండి వెళ్లేటప్పుడు కూడా ఈ నిరసనకారులు బిగ్గరగా అరుస్తూనే ఉన్నారు. మెక్సికో, గ్వాటెమాల, స్పెయిన్ తో పాటు సెంట్రల్ అమెరికా దేశాలకు చెందిన వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను అమెరికాలోని కొన్ని కోర్టులు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల సియాటిల్ కోర్టు కూడా ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు నిర్నయాన్ని తప్పుపడుతున్నట్లు అభిప్రాయపడింది.