Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందువుపై దాడి.. ఎన్నికల వేళ పెరుగుతున్న ఉద్రిక్తతలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి.

Update: 2026-01-01 14:33 GMT

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందువుపై దాడి.. ఎన్నికల వేళ పెరుగుతున్న ఉద్రిక్తతలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా హిందువులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా షరియత్‌పుర్ జిల్లాలో మరో హిందువుపై మూక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. షరియత్‌పుర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల ఖోకన్‌దాస్‌ పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి నిప్పంటించారు. అయితే ఖోకన్ అక్కడి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న చెరువులోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం స్థానికులు అతడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనను పలు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాధితుడికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

షేక్ హసీనా గద్దె దిగిన అనంతరం తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో రాజకీయ అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అస్థిర వాతావరణంలోనే మైనారిటీలపై దాడులు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల నేపథ్యంలో దీపూ చంద్ర దాస్‌, అమృత్ మండల్‌ వంటి హిందూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో బజేంద్ర బిశ్వాస్‌ తన సహోద్యోగి చేతిలో కాల్పులకు గురై మరణించినట్లు సమాచారం.

ఈ వరుస దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.

Tags:    

Similar News